శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (10:31 IST)

రణ్‌బీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌లోకి అలియా భట్!

బాలీవుడ్ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో.. సాధారణ జనంతోపాటు పలువురు సినీ హీరోలు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ యువ హీరో రణ్‌బీర్ సింగ్‌కు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. రణ్‌బీర్ ఆరోగ్యంపై ఆయన తల్లి నీతూ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
 
"రణ్‌బీర్ కపూర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అభిమానం కురిపించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. రణ్‌బీర్‌కు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. అతడికి వైద్య చికిత్స అందిస్తున్నాం. వైరస్ నుంచి వేగంగా కోలుకొంటున్నారు. ప్రస్తుతం ఇంటిలోనే క్వారంటైన్‌లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆయన అభిమానులు కూడా ఆరోగ్యం ఉండాలని కోరుకొంటున్నారు" అని నీతూ సింగ్ ఇన్స్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
 
కొద్ది వారాల క్రితం రణ్‌బీర్ తల్లి, నటి నీతూ కపూర్ కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. ఆమె నటిస్తున్న జగ్ జగ్ జీయో అనే చిత్ర షూటింగులో పాల్గొన్న సందర్భంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అనే విషయం తేలింది. ఆ తర్వాత ఆమె కరోనావైరస్‌ను జయించారు.
 
ఇదిలా ఉండగా, రణ్‌బీర్ కపూర్ కరోనావైరస్ బారిన పడగానే బాలీవుడ్ నటి ఆలియాభట్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గంగూభాయ్ కతియావాడి షూటింగులో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో ఆలియా కూడా ఇంటిలో స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నట్టు తెలిసింది.
 
ఇటీవల రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్‌ కూడా పలు పార్టీలో పాల్గొంటూ సన్నిహితంగా ఉన్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో కనిపించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రణ్‌బీర్‌కు కరోనాసోకడంతో ఆలియాభట్ జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగుకు మార్చి 12వ తేదీన హాజరుకావాల్సి ఉన్న సమయంలో క్వారంటైన్‌లోకి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
 
అలాగే అలియా భట్ ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’.. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షూటింగ్ జరుగుతుండగా దర్శకుడికి కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించగా సంజయ్ లీలా భన్సాలీకి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. 
 
దీంతో ఆయన వైద్యుల సలహాలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పులువురు యూనిట్ సభ్యులకు కూడా కోవిడ్ పాజిటివ్ రావడంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి అలియా భట్‌తో సహా ఎవరికి వారు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
 
ముంబైలోని కామటిపురా ప్రాంతంలో, గంగుబాయి అనే వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామటిపుర’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయనున్నామని ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి విడుదల వాయిదా పడే అవకాశముందని సమాచారం.