గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (17:20 IST)

ప్రేమ కథతో పాటు వెంటాడే ఓ ప్రమాదం థ్రిల్ కలిగే పాయింట్ : నచ్చింది గాళ్ ఫ్రెండూ హీరో ఉదయ్‌ శంకర్‌

Uday Shankar
Uday Shankar
‘ఆటగదరా శివ’, ‘మిస్ మ్యాచ్‌’, ‘క్షణ క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో  హీరోగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు ఉదయ్‌ శంకర్‌. ఆయన నటించిన కొత్త సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆర్ట్స్ ‍ పతాకంపై అట్లూరి ఆర్‌ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. దర్శకుడు గురు పవన్‌ రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హీరో ఉదయ్‌ శంకర్‌ ఇంటర్వ్యూలో చెప్పిన చిత్ర విశేషాలు చూస్తే...
 
- దర్శకుడు గురు పవన్‌ నాకు మంచి మిత్రుడు. ఆతను రూపొందించిన తొలి సినిమా ఇదే మా కథ చూసి ఫోన్‌ చేశాను. గురు..సినిమాలో నువ్వు చెప్పాలనుకున్నది చూపించావు. నువ్వు సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది అన్నాను. థ్రిల్లర్‌తో సాగే ఒక మంచి లవ్‌ స్టోరి చేయాలనే ఆలోచన నాలో ఉండేది. ఈ విషయాన్ని గురు పవన్‌కు చెబితే తనో కథ తయారు చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితమే ఈ కథను నాకు చెప్పాడు. మేము సినిమా చేసే టైమ్‌కు అది మరింత మెరుగైన స్క్రిప్ట్‍గా తయారు చేశాడు. ఓటీటీలు వచ్చాక ఆడియెన్స్​‍ అప్‌డేట్‌ అయ్యారు కదా. వారికి కూడా నచ్చేలా తీర్చిదిద్దాడు. 
 
- సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య 12 గంటల్లో జరిగే కథ ఇది. ఉదయం ఆరు గంటలకు మొదలై...సాయంత్రం ఆరు గంటలకు పూర్తవుతుంది. దేశ భద్రతకు సంబంధించిన ఒక సోషల్‌ ఇష్యూ కూడా ఇందులో చర్చించాం. విశాఖపట్నంలో ఔట్‌డోర్‌లోనే 95 శాతం షూటింగ్‌ చేశాం. ఈ చిత్రంలో రాజారాం అనే పాత్రలో నటించాను. అతనో అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమె వెంట పడతాడు. వీళ్ల ప్రేమ కథ ఇలా సాగుతుంటే...వాళ్లిద్దరికీ తెలియని ఓ ప్రమాదం వారిని వెంటాడుతుంటుంది. అది ప్రేక్షకులకు తెలుస్తుంది. నాయిక పాత్రలో జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ బాగా నటించింది. 
 
- ఈ సినిమాలో ఇఫ్‌ ఐ డై అనే ఒక యాప్‌ గురించి చర్చించాం. యుద్ధ సమయంలో సైనికులు తాము చనిపోతున్న పరిస్థితుల్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలని లేదా ముఖ్య విషయాలను ఉన్నతాధికారులకు, నాయకులు పంపించేలా ఒక వాచ్‌ డిజైన్‌ చేశారు. ఆ వాచ్‌లో ఈ యాప్‌ ఉంటుంది. ఇది నిజంగానే ప్రయోగ దశలో ఉన్న యాప్‌. మరో రెండు మూడేళ్లలో ఇది అందుబాటులోకి రానొచ్చు. ఈ యాప్‌ నేపథ్యంగానే కథ సాగుతుంటుంది. ద్వితీయార్థంలో అనేక మలుపులు వస్తాయి. ప్రతి సీన్‌ మరో దానితో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కటి చూడకున్నా ...ఇక్కడ ఏం జరిగింది అని అనిపిస్తుంటుంది. షేర్‌ మార్కెట్‌ గురించిన పాత్రలు, సన్నివేశాలుంటాయి. 
 
- యాక్షన్‌, థ్రిల్లర్‌, హ్యూమర్‌ వంటి అంశాలను ఇష్టపడతాను. రొమాంటిక్‌ సీన్స్​‍ చేయడానికి ఇబ్బంది పడుతుంటా. ఒక పూటలో జరిగే కథ కాబట్టి సినిమా మొత్తం ఒకటే కాస్ట్యూమ్‌లో కనిపిస్తాను. అయితే హీరోకు ఒక ఫాంటసీ సాంగ్‌ ఉంటుంది. దీన్ని గోవాలో చిత్రీకరించాం. ఈ పాట ఎక్కడా అసభ్యత లేకుండా శృంగారభరితంగా ఉంటుంది. కొరియోగ్రాఫర్‌ అలా డిజైన్‌ చేశారు. మంచి సినిమాకు చిన్నా పెద్దా అనే తేడాలు లేవు. కాంతారా అనే కన్నడ సినిమా తెలుగులో అనువాదమై ఘన విజయాన్ని సాధించింది. భోజ్‌పురి సినిమా అయినా ఫర్వాలేదు కథ బాగుండి, రెండు గంటలు ప్రేక్షకులు చూసేలా ఉంటే తప్పక ఆదరణ పొందుతుంది. 
 
- నేను ఇప్పటిదాకా నటించిన ఆటగదరా శివ, మిస్ మ్యాచ్‌, క్షణక్షణం వేటికవి భిన్నమైన చిత్రాలు. తెలుగులో అడివి శేష్‌, బాలీవుడ్‌లో ఆయుశ్మాన్‌ ఖురానాలా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ పేరు తెచ్చుకోవాలని ఉంది. మా సినిమాతో పాటు సమంత యశోద కూడా రిలీజ్‌ అవుతోంది. ఈ రెండు చిత్రాలను ఆదరించాలని కోరుకుంటున్నా. నటుడు మధునందన్‌ సోదరుడు మోహన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. సంక్రాంతికి ఆ చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ సినిమా కూడా థ్రిల్లర్‌తో కూడిన ప్రేమ కథతో తెరకెక్కిస్తాం