మెగాస్టార్‌తో కలిసి సంక్రాంతికి వస్తాం : దర్శకుడు అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవితో కలిసి వచ్చే యేడాది సంక్రాంతి పండుగకు వస్తామని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. విక్టరీ వెంకటేష్ - అనిల్ దర్శకత్వంలో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మాత.
ఇపుడు మెగాస్టార్‌తో కలిసి అనిల్ రావిపూడి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అనిల్ రావిపూడి బృందం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. చిరంజీవితో చేయనున్న సినిమా స్క్రిప్ట్‌ను స్వామి చెంతన ఉంచి పూజలు జేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో కుటుంబ కథా చిత్రం చేయనున్నట్టు తెలిపారు. జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయడానికి ప్రణాళికలు వేసుకున్నామన్నారు. ఈ చిత్రంలో వినోదానికి ఏమాత్రం కొదవలేదన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్‌తో ప్రయాణం కొనసాగుతుందన్నారు. చిరంజీవి చిత్రంలోనూ రమణ గోకులతో ఓ పాట పాడిస్తానని అనిల్ రావిపూడి తెలిపారు.