క్రేజీగా అపరిచితుడు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. మే 17న భారీగా రిలీజ్
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత వీ రవిచంద్రన్ కాంబినేషన్‌లో విక్రమ్, సదా నటించిన చిత్రం అపరిచితుడు. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగా మార్చింది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో అపరిచితుడు సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయల షేర్ ప్రపంచవ్యాప్తంగా సాధించి పెట్టింది. ఈ చిత్రం ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలు హై ఓల్టేజ్‌ను అందించాయి. విక్రమ్ నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. ద్విపాత్రాభినయంతో రెమో అనే అపరిచితుడుగా, బ్రాహ్మణుడిగా రెండు పాత్రల్లో దుమ్మురేపారు. ఇప్పటికీ విక్రమ్ ఫెర్ఫార్మెన్స్ మ్యాచ్ చేసిన దాఖలాలు లేవని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి.
అపరిచితుడు సినిమాకు హ్యారీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఆయన రూపొందించిన పాటలు చార్ట్‌బస్టర్‌లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ సాంగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించాయి. అలాంటి సినిమాను రీ రిలీజ్ అవుతుందంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అపరిచితుడు రీరిలీజ్‌కు అంతా సిద్దమైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా మంచి స్పందన కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్‌లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు.