ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (17:56 IST)

మ్యాస్ట్రోలో 'బేబీ ఓ బేబీ' సాంగ్ విడుద‌ల‌

నితిన్ కు ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ ఉన్నప్ప‌టికీ  యూత్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలీ ప్రేక్షకులకు  దగ్గరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన సబ్జెక్ట్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు.  ప్రస్తుతం నితిన్‌ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్న ''మాస్ట్రో'' సినిమా కూడా విలక్షణమైన కథతో వస్తోంది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి మ‌హతి స్వ‌ర‌సాగ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల ఆయ‌న స్వ‌ర‌ప‌రిచిన  'బేబీ ఓ బేబీ` ప్రోమో సాంగ్ ఫుల్ సాంగ్‌పై క్యూరియాసిటీని పెంచింది. కాగా ఈరోజు  'బేబీ ఓ బేబీ` ఫుల్ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ని విడుద‌ల‌చేసింది 'మాస్ట్రో' టీమ్. 'అంతులేని కళ్ళలోకిలా.. అందమొచ్చి దూకితే ఎలా..అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ ని యువ మ్యూజిక్ సెన్సేషన్ అనురాగ్ కులకర్ణి వాయిస్ మరింత స్పెషల్ గా మార్చింది. దీనికి ప్రముఖ గీత రచయిత శ్రీజో సాహిత్యం అందించారు.
నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చిన మహతి స్వర సాగర్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేశార‌నిపిస్తోంది.
 
 'బేబీ ఓ బేబీ' పాట చూస్తుంటే నితిన్ - నభా నటేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు అనిపిస్తోంది. గోవాలోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ షూట్ చేశారు. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
 
నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి. మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
నటీనటులు: నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి.