మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (16:05 IST)

సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తాం : బండి సంజయ్ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తామంటూ బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఫాంహౌస్‌కే పరిమితమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన గాలికి వదిలారని ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి వేడుకులు దేశ వ్యాప్తంగా జరిగాయన్నారు. కానీ, ఆ వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పరిస్థితి లేదన్నారు. జనగామలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు ఏ విధంగా లాఠీచార్జ్ జరిపింది దేశమంతా చూశారన్నారు. 
 
బీజేపీ కార్యకర్తలు వివేకానంద జయంతి జరుపుకుంటుంటే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జనగామ ఘటనపై స్పందించాలని, కమిషనర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
దాడిచేసిన వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామని, భవిష్యత్ కార్యాచరణ జనగామ గడ్డ నుంచే ప్రకటిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. తమ కార్యాచరణలోభాగంగా కేసీఆర్ ఫాంహౌస్‌పై కూడా దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు.