జగన్ మూటాముల్లె సర్దుకునే రోజు వస్తుంది : బండి సంజయ్
ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆలయాల్లోని దేవతామూర్తులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదన, విజయవాడల సీతమ్మ విగ్రహం ధ్వంసం వంటి సంఘటనలు జరిగాయి. వీటిపై బండి సంజయ్ స్పందించారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని ఆరోపించారు. తీరు మార్చుకోకపోతే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే తిరుపతి లోక్‍సభ ఉపఎన్నికలో కూడా పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు.
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. హిందూ దేవాలయాలకు వస్తున్న కానుకలు, నిధులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతాలకు దారి మళ్లిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని అన్నారు.
దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని హెచ్చరించారు.
సింహాచలం పాలక మండలి మార్పు నుంచి, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, నిన్న రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించడం వరకు ఎన్నో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో ఒక మతానికి ఇక్కడి సీఎం కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని... ఏపీలో ఒక మతమే రాజ్యమేలుతోందని బండి సంజయ్ ఆరోపించారు.