పవన్ - బోయపాటి చిత్రం... బండ్ల గణేశ్ నిర్మాత... బడ్జెట్ ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నిర్మాత బండ్ల గణేష్ ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన పవన్‌కు భారీ రెమ్యునరేషన్‌ను కూడా ఆఫరే చేసినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పైగా, ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని వంద కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలన్న ఉద్దేశ్యంతో బండ్ల గణేశ్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల్లో పవన్ కళ్యాణ ఓడిపోవడంతో మరో ఐదేళ్ల వరకు ఆయన ఖాళీగా ఉండాల్సిందే. ఈ లోపు యేడాదికి ఒక చిత్రం చొప్పున చేసినా ఐదు చిత్రాలు చేయవచ్చన్నది సినీ ప్రముఖుల మాటగా ఉంది. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం తాను రాజకీయాలకే పరిమితమవుతానని, సినిమాల్లోకి వెళ్లనని స్పష్టంచేశారు.
ఈ పరిస్థితుల్లో బండ్ల గణేశ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడులా పవన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ పవన్‌కు సమ్మతిస్తే ఆయనకు రూ.40 కోట్లు, దర్శకుడు బోయపాటి శ్రీనుకు రూ.10 కోట్లు చొప్పున ఇచ్చి, మరో రూ.50 కోట్లతో చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో బండ్ల గణేశ్ ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రావాలంటే హీరో పవన్ కళ్యాణ్ పచ్చజెండా ఊపాల్సి ఉంటుంది.