'రాక్షసుడు' గా బెల్లంకొండ శ్రీనివాస్?
మొదటి సినిమా 'అల్లుడు శీను' తర్వాత అంత మాత్రం హిట్ సాధించలేకపోయిన బెల్లంకొండ శ్రీనివాస్... తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. గత ఏడాది తమిళంలో హిట్ సాధించిన 'రాచ్చసన్' సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా రూపొందనుంది. తమిళంలో విష్ణు విశాల్.. అమలా పాల్ జంటగా నటించిన ఈ సినిమా తమిళనాట భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రీమేక్‌కి నిర్మాతగా కోనేరు సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.
కాగా, రమేశ్ వర్మ ఈ సినిమాకి 'రాక్షసుడు' అనే టైటిల్‌ని ఖరారు చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి హీరోగా 'రాక్షసుడు' వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఆ మధ్య సూర్య నటించి తెలుగులోకి అనువదించబడిన సినిమా కూడా 'రాక్షసుడు' టైటిల్‌తోనే తెలుగులోకి వచ్చింది.
మళ్లీ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి అదే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. ఈ టైటిల్ ఖాయమైపోయినట్లేనని అంటున్నారు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడిగా రానున్నారో... లేదా మరే పేరుతోనైనా రానున్నారో... వేచి చూద్దాం.