Sapta saagaralu daati Side B team with KV Anudeep, Srinivas
ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన 'సప్త సాగరాలు దాటి సైడ్ ఎ' విశేష ఆదరణ పొందింది. దీంతో 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు కేవీ అనుదీప్, శ్రీనివాస్ అవసరాల పాల్గొన్నారు.
చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టి మాట్లాడుతూ, "నా సినిమాల నేను ఇక్కడికి రావడం ఇది నాలుగోసారి. గతంలో 'అతడే శ్రీమన్నారాయణ', '777 చార్లీ', 'సప్త సాగరాలు దాటి సైడ్ ఎ' చిత్రాల కోసం వచ్చాను. ఇప్పుడు సైడ్ బి కోసం వచ్చాను. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీడియా కూడా ఎంతో సపోర్ట్ గా ఉంది. తెలుగులో ఇంత ఘనంగా విడుదల చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, వివేక్ గారికి కృతఙ్ఞతలు" అన్నారు.
చిత్ర కథానాయిక రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ, "సప్త సాగరాలు దాటి సైడ్ ఎ చిత్రాన్ని ఆదరించి, మాకు ఇంత ప్రేమ పంచిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మను, ప్రియల కథ మీ హృదయాల్లో చోటు సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. సైడ్ బి లో మరిన్ని అందమైన పాత్రలు ఉంటాయి. సైడ్ బి కూడా మిమ్మల్ని మెప్పిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, వివేక్ గారికి థాంక్స్" అన్నారు.
చిత్ర కథానాయిక చైత్ర జె. ఆచార్ మాట్లాడుతూ, "సైడ్ ఎ కి మీరిచ్చిన సపోర్ట్ కి చాలా హ్యాపీ. సైడ్ బి కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా సినిమాకి ఇక్కడ ఇంత ప్రేమ దొరకడానికి కారణమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు" అన్నారు.
చిత్ర దర్శకుడు హేమంత్ రావు మాట్లాడుతూ, "తెలుగు రాష్ట్రాల్లో సైడ్ ఎ కి వచ్చిన స్పందన పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. సైడ్ ఎ కి కొనసాగింపుగా సైడ్ బి కథ ఉంటుంది. అయితే సైడ్ ఎ తో పోలిస్తే, సైడ్ బి షేడ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎన్నో ఫోన్లు, మెసేజ్ లు చేసి ప్రశంసిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు. హైదరాబాద్ లో సైడ్ ఎ కన్నడ వెర్షన్ మంచి స్పందన రావడం చూసి, తెలుగులో విడుదల చేయాలి అనుకున్నాం. తక్కువ సమయమే ఉన్నప్పటికీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఘనంగా విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేశారు" అన్నారు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ, "సైడ్ ఎ విడుదల సమయంలో ప్రమోషన్స్ కి కావాల్సినంత సమయం లేదు. కేవలం విడుదలకు మూడు నాలుగు రోజుల ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేశాం. అయినప్పటికీ చాలా చోట్ల మొదటి రోజు నుంచే హౌస్ ఫుల్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించిదానికంటే మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు 17వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి, పబ్లిసిటీ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సైడ్ ఎ కంటే సైడ్ బి పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం" అన్నారు.
నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ, "ఈ సినిమా చూస్తున్నాడు నాకు జో అచ్యుతానంద చిత్రంలో చిన్న సీన్ గుర్తుకొచ్చింది. అందులో నారా రోహిత్ పాత్ర.. నాకు జీవితంలో పెద్దగా కోరికల్లేవు, చిన్న చిన్న ఆనందాలతో జీవితం సాగిపోతే చాలు అని ఒక సన్నివేశంలో చెప్తాడు. మనకు జీవితంలో చాలా ఆనందాలు కేవలం ఇంత ఉంటే చాలు అనుకునేలా ఉంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం అవి ఎంతో దూరాన సప్త సాగరాలు దాటితే గాని అందవు అనేలా మారుతుంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం చేసే ప్రయత్నాలు.. విధి కారణంగా ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు. పరిస్థితులకు తగ్గట్టుగా పాత్రలు ఎలా మారుతుంటాయో ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఇలాంటి చిత్రాలకు రచన చాలా చాలా బాగుండాలి. నటన సహజంగా ఉండాలి. ఈ చిత్రంలో ఆ రెండూ ఉన్నాయి. సైడ్ ఎ, సైడ్ బి అని పేర్లు పెట్టిన విధానాం నాకు చాలా నచ్చింది. ప్రతి కథకి ఎన్నో కోణాలు ఉంటాయి. సైడ్ ఎ లో కనిపించని కోణాలు ఏమైనా సైడ్ బిలో కనిపిస్తాయా అని నేను ఎదురుచూస్తున్నాను. మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అన్నారు.
దర్శకుడు కేవీ అనుదీప్ మాట్లాడుతూ, " మీరందరూ సప్త సాగరాలు దాటి సైడ్ ఎ చూసే ఉంటారు. చాలా మంచి స్పందనను తెచ్చుకుంది. అలాగే సైడ్ బి ని కూడా మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. రక్షిత్ శెట్టి గారి సినిమాలన్నీ చూస్తుంటాను. ఆయనతో పాటు టీం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.