ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:16 IST)

మళ్లీ ఆగిన భారతీయుడు 2... వారు తప్పుకోవడం వల్లనే..

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'భారతీయుడు 2'. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సమాజంలో పేరుకుపోయిన లంచగొండితనం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో సాగింది. అదే తరహాలో ఇటీవలికాలంలో తాను గమనించిన కొన్ని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయుడు 2 కథ సిద్ధం చేశానని శంకర్ తెలిపారు. ఇందులో కూడా కమల్ హాసన్ ఓల్డ్ మాన్ గెటప్‌లో కనిపిస్తారు.
 
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే బ్రేక్ పడటంతో అప్పట్లో 'భారతీయుడు 2' ప్రాజెక్ట్ ఇక ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. తర్వాత ఆ వార్తలను ఖండిస్తూ "భారతీయుడు 2" ఆగిపోలేదని, కమల్ హాసన్ ఎన్నికల ప్రచారం కోసం బ్రేక్ తీసుకోవడం వలన తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చామని చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా కమల్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ చిత్రం ఇక ముందుకెళ్లే అవకాశాలు లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
 
దీనికి కారణం.. కొన్ని కారణాల వలన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ ఎలాగైనా ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగించాలనే పట్టుదలతో అటు లైకా ప్రొడక్షన్స్, ఇటు కమల్ హాసన్‌తో గట్టిగా సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే లైకా ప్రొడక్షన్స్ మాత్రం ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం మరో పెద్ద నిర్మాతను వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది.