శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (16:23 IST)

బుట్ట బొమ్మ కలర్ ఫుల్ గా ఉంటుంది : అనిక సురేంద్రన్

Anika Surendran
Anika Surendran
సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి 'బుట్ట బొమ్మ' అనే మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.
 
బుట్టబొమ్మ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది?
ఎన్నో ఏళ్లుగా బాల నటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కప్పేల మలయాళ వెర్షన్ చూశాను.. చాలా నచ్చింది. ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది.
 
బుట్టబొమ్మ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?
అప్పటికే ఈ సినిమా మాతృక చూసి ఉన్నాను. నాకు ఎంతో నచ్చిన ఆ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తోంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను.
 
సినిమాలో ఏమైనా మార్పులు చేశారా?
మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది. 
 
మొదటిసారి హీరోయిన్ గా నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?
హీరోయిన్ గా నటించడం ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అయితే దర్శకుడు రమేష్ గారు, మిగతా చిత్ర యూనిట్ మద్దుతుతో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సినిమాని పూర్తి చేయగలిగాను.
 
అర్జున్ దాస్ వాయిస్ విని భయపడిన సందర్భాలు ఉన్నాయా?
అవును ఆయన వాయిస్ లో చాలా బేస్ ఉంటుంది. ఆయన వాయిస్ విని చాలా సీరియస్ గా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఆయన చాలా స్వీట్ పర్సన్.
 
రీమేక్ చేసినప్పుడు సహజంగానే మాతృకతో పోలుస్తుంటారు కదా.. నటించేటప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచించారా?
ముందే చెప్పినట్లుగా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలో కొన్ని మార్పులు చేశారు. అలాగే నేను కూడా ఒరిజినల్ ఫిల్మ్ లోని నటిని కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదు. పాత్రను అర్థం చేసుకొని ఆ సన్నివేశాలకు తగ్గట్లుగా నటించాను.
 
ఈ సినిమా ద్వారా ఏమైనా నేర్చుకున్నారా?
ఎంతో నేర్చుకున్నాను. దర్శకత్వ విభాగంలో అనుభవమున్న రమేష్ గారు నటన పరంగా ఎన్నో మెలుకువలు నేర్పించారు.
 
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారా?
మొదటి సినిమానే సితారలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా విడుదలకు ముందే తెలుగులో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
 
మీ తదుపరి చిత్రాల గురుంచి చెప్పండి?
మలయాళంలో 'ఓ మై డార్లింగ్' అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.