శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (12:59 IST)

విజయ్ దేవరకొండ 12వ చిత్రం సిద్ధమవుతోంది

Vijay Devarakonda's 12th film
Vijay Devarakonda's 12th film
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'జెర్సీ' చిత్రం కోసం జతకట్టారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది.
 
తెలుగు, హిందీ పరిశ్రమలలో ప్రతిభగల దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి నిరూపించుకున్నారు. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఎంతో ప్రతిభగల గౌతమ్ ఇప్పుడు మరో ప్రతిభావంతుడు, యువ సంచలనం విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. వీరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలను అధిగమించి, అందరినీ అలరించే చిత్రం అందిస్తామని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇది భూమి బద్దలై పోయేది, అత్యంత భారీగా ఉంటుందని తాము చెప్పట్లేదు.. కానీ అద్భుతమైన విషయం అని మాత్రం చెప్పగలమని నిర్మాత నాగవంశీ అన్నారు.
 
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, పెళ్లి చూపులు వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకొని విజయ్ దేవరకొండ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తానని దర్శకుడు అంటున్నారు. ఎందరో నటీనటులతో పనిచేస్తూ ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటిసారి విజయ్‌తో జత కట్టడంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
 
చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారి ని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద "I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అని రాసుండటం గమనించవచ్చు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు.
 
ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.