1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (10:05 IST)

డీజే టిల్లు సీక్వెల్ కి టిల్లు స్క్వేర్ టైటిల్ ని ఖరారు

Sidhu Jonnalagadda
Sidhu Jonnalagadda
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'డీజే టిల్లు' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో 'డీజే టిల్లు' సీక్వెల్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే 'డీజే టిల్లు' సీక్వెల్ ని రూపొందిస్తూ మాట నిలబెట్టుకున్నారు నాగవంశీ.
 
'డీజే టిల్లు' సీక్వెల్ కి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
'టిల్లు స్క్వేర్' షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాక్సాఫీస్ దగ్గర 'డీజే టిల్లు' సంచలనం సృష్టించిన ఏడాదికే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది. 'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దీపావళి కానుకగా ఒక ప్రత్యేక వీడిమోని విడుదల చేసింది చిత్ర బృందం. అందులో టిల్లు మద్యం  మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. తాను హీరోనని, తన పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుందాం అనుకుంటే డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం అలరించింది.  రెండు నిమిషాల నిడివి గల వీడియోతో సీక్వెల్ లో 'డీజే టిల్లు'ని మించిన వినోదాన్ని పంచబోతున్నారని చెప్పకనే చెప్పేశారు. స్టార్ బోయ్ సిద్దు వాచికాభినయాలు మరోసారి వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.
 
'డీజే టిల్లు' టైటిల్ సాంగ్ ని స్వరపరిచి విశేషంగా ఆకట్టుకున్న రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. 'టిల్లు స్క్వేర్'తో రెట్టింపు వినోదాన్ని పంచి, 'డీజే టిల్లు'ని మించిన విజయాన్ని సాధిస్తామని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
 
దీపావళి కానుకగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో రూపొందుతోన్న మరో రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపందుతోన్న ద్విభాషా చిత్రం 'సార్/  వాతి' నుంచి తాజాగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. నీలి రంగు చొక్కా ధరించి ఫైట్ చేస్తున్న ధనుష్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దీపావళి పండగ విశిష్టతను తెలియజేస్తూ చెడుపై మంచి విజయం అని తెలిపేలా ఉంది పోస్టర్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయిక. అలాగే సితార నిర్మిస్తున్న మరో చిత్రం ' బుట్ట బొమ్మ ' పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ పాత్రలలో కూడిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ టి.రమేష్ దర్శకుడు.
 
చిత్రం పేరు: టిల్లు స్క్వేర్
తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్
దర్శకుడు: మల్లిక్ రామ్
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్
కూర్పు: నవీన్ నూలి
సంగీతం: రామ్ మిరియాల
కళ: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్