బుధవారం, 29 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఆగస్టు 2025 (14:43 IST)

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

Flood water in Tadikonda
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇటు ఆంధ్ర ప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపిలో మంగళవారం కురిసిన వర్షాలకు కొండవీడు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద కాస్తా గుంటూరుకి ఎగువన వున్న ప్రాంతాలను నీటిలో ముంచెత్తుతోంది. దీనితో కొందరు అమరావతి రాజధానికి లింకు పెట్టేస్తూ, నీటి నగరం అమరావతి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
 
రాబోయే కాలంలో వర్షాకాలంలో అమరావతి నగరంలో తిరిగేందుకు ప్రభుత్వం పడవలను ఏర్పాటు చేస్తుందేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం, నీటిలో అమరావతి రాజధానిని నిర్మిస్తోంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం అతిభారీ వర్షం కారణంగా జలమయమైన ప్రాంతాలను, రోడ్లను వీడియోలలో పెడుతూ అమరావతి రాజధాని నీటిలో మునిగిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై అమరావతికి మద్దతు తెలిపేవారు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
 
ఓ వెర్రిమొర్రి పిందెల్లారా... ఇంకా అమరావతి రాజధాని పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి కాలేదు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో రూపాంతరం చెందలేదు. నిర్మాణదశలో వున్న నగరాన్ని పట్టుకుని మునిగిపోయిన నగరం, నీటిలో వుండే నగరం అంటూ ఎక్కడో కొండవీడు వాగు పొంగితే ఆ విజువల్స్ పట్టుకుని మునిగిపోయిన అమరావతి అంటూ పోస్టులు పెడుతున్నారే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
అంతేకాదు... అతిభారీ వర్షాలు కురిస్తే... అమరావతి ఒక్కటే కాదు, దేశంలోని చాలా నగరాలు మునిగాయి చూడండి అంటూ గతంలో ఆయా నగరాలు వర్షపు నీటిలో చిక్కుకున్న వీడియోలను జోడిస్తున్నారు. మొత్తమ్మీద ఛాన్స్ దొరికితే అమరావతి రాజధానిపై పడిపోయే వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.