గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (18:20 IST)

ముంబై సీబీఎఫ్‌సీలో అవినీతి.. విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం

vishal
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నట్టు కోలీవుడ్ నటుడు విశాల్ ఆరోపణలు చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. తన మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ చిత్రం సెన్సార్ షిప్ కోసం రూ.6.50 లక్షలు లంచంగా ఇచ్చినట్టు నిధుల బట్వాడా చేసిన బ్యాంకు ఖాతా నంబర్లతో సహా బహిర్గతం చేశారు. పైగా, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ట్యాగ్ చేశారు. దీంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. 
 
ఈ వ్యవహారంపై అత్యవసర సమావేశం అనంతరం సెన్సార్‌ బోర్డు స్పందించింది. విశాల్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసింది సెన్సార్‌ సభ్యులు కాదని, థర్డ్‌పార్టీ వారని తెలిపింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. 
 
ఈ మేరకు 'ఈ- సినీప్రమాన్‌' వేదిక చేసుకోవాలని దర్శక, నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది. నిబంధనలు పాటిస్తూ నిర్ణీత సమయంలోనే సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. "సీబీఎఫ్‌సీ ప్రతి సంవత్సరం 12 వేల నుంచి 18 వేల చిత్రాలకు సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఇన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది. కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారు" అని గుర్తు చేసింది.