శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (18:37 IST)

మేనక మేడమ్ గారు.. ఏం చెయ్యమంటారు.. ట్యాగ్ చేసిన చిన్మయి (video)

దేశంలో వైరల్ అయిన మీటూ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద మీటూ పేరుతో ఉద్యమాన్ని వెలుగులోకి తెచ్చారు. తమిళ సినీరంగంలో అవార్డు విన్నింగ్‌ రచయితగా, సెలబ్రిటీగా వెలుగొందుతున్న సినీ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు చిన్మయి. అంతేకాదు తన లాంటి అనేకమంది బాధితుల గోడును వెలుగులోకి తీసుకొచ్చారు. 
 
ఇంకా వారికి మద్దతుగా నిలిచారు. దీంతోపాటు ప్రముఖ నటుడు, తమిళనాడు ఫిలిం డబ్బింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రాధా రవిపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితులకు కూడా చిన్నయి బహిరంగ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఇపుడు ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది. చిన్మయిని తమిళ డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగిస్తూ.. సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
 
తాజాగా చిన్మయి శ్రీపాద ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి మేనకా గాంధీని ట్యాగ్ చేశారు. వైరముత్తు తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు మాసాలైంది. ఇందులో తనకు న్యాయం జరగలేదని.. ఇంకా తనను సినీ ఇండస్ట్రీ నుంచి తప్పించారు. డబ్బింగ్ యూనియన్ నుంచి వెలివేశారు. ప్రస్తుతం తాను కేసు పెట్టలేని పరిస్థితిలో వున్నాను. 
 
తనకేమైనా దారి చూపండి అంటూ చిన్మయి సోషల్ మీడియా ద్వారా మోదీ, మేనకలను ట్యాగ్ చేస్తూ వెల్లడించారు. ఈ ట్వీట్‌పై మేనకా గాంధీ స్పందించారు. మీ కేసును జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని.. వివరాలను తనకు పంపించాలని చిన్మయిని కోరారు.
 
కాగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్‌ విషయాలను చిన్మయి బయటపెట్టారు. అప్పటినుంచి వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా చిన్మయిని కోలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.