బలగం సంగీత దర్శకుడి భీమ్స్ సిసిరిలియోకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
ఇటీవలి కాలంలో సూపర్‌డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా `బలగం`. బంధాలు, బంధుత్వాల గురించి మనసులను తాకి మరీ చెప్పిన చిత్రం బలగం. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన చిత్రమిది. హర్షిత్ రెడ్డి, హన్షిత ప్యాషన్‌తో నిర్మించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను సమర్పించారు. మనసులను హత్తుకున్న కుటుంబకథా చిత్రంగా ప్రేక్షకులను అలరించింది `బలగం`. మౌత్ టాక్‌తో జనాల్లోకి వెళ్లి మళ్లీ మళ్లీ చూసేలా చేసింది ఈ సినిమా. అందుకే బాక్సాఫీస్ దగ్గర బంధాలకు విలువిస్తూ కాసులు కురిశాయి.
తెలంగాణ ఆత్మ, తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో బంధాలు, బంధుత్వాలు, విలువలు, మట్టివాసనను చెప్పిన `బలగం` చిత్రానికి ఇప్పటికే ఎన్నో గ్లోబల్ అవార్డులు అందాయి. ఇప్పుడు తాజాగా 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ సినిమా పేరు మారుమోగుతోంది. బలగం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరిలియోకి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఈ వేదిక మీద అవార్డు దక్కింది. భీమ్స్ తో పాటు నిర్మాత హర్షిత్ రెడ్డి కూడా ఈ ప్రెస్టీజియస్ అవార్డును అందుకున్నారు.
దాదాపు 780కిపైగా సినిమాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. 81 దేశాల నుంచి సంగీత దర్శకులు పోటీపడ్డారు. కానీ తెలంగాణ మట్టివాసన, ఇక్కడి సంగీతానికున్న తడి ప్రపంచ దేశాల మెప్పు పొందింది. అందరు పోటీపడ్డప్పటికీ అవార్డు బలగం సంగీతదర్శకుడు భీమ్స్ ని వరించింది. భీమ్స్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన పడ్డ శ్రమ స్క్రీన్ మీద ప్రతిబింబించింది. ప్రతి ప్రేక్షకుడూ ఆ బాణీలకు, నేపథ్య సంగీతానికి ఫిదా అయ్యారు. తమ మూలాలను తడిమిచూసుకున్నారు. తనివి తీరా సంగీతాన్ని ఆస్వాదించారు. అందరి మన్ననలు పొందింది కాబట్టే విశ్వ వేదిక మీద అవార్డును గెలుచుకొచ్చింది బలగం బాణీ. బలగం సంగీత సృష్టికర్త భీమ్స్ సిసిరిలియో.
ప్రియదర్శి పులికొండ హీరోగా నటించిన సినిమా బలగం. కావ్య కల్యాణ్ రామ్ కథానాయిక. మురళీధర్‌గౌడ్, రూపాలక్ష్మి, సుధాకర్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.