గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (07:02 IST)

'భారతీయుడు' సీక్వెల్.. బడ్జెట్ రూ.180 కోట్లు.. దిల్ రాజు వెల్లడి

తమిళ దర్శకుడు ఎస్.శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భారతీయుడు. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారతీయుడు గెటప్‌లో కమల్ లంచం తీసుకునే

తమిళ దర్శకుడు ఎస్.శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భారతీయుడు. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారతీయుడు గెటప్‌లో కమల్ లంచం తీసుకునే అవినీతి పరుల పనిపడతారు. అయితే అప్పట్లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే కాదు, పలు అవార్డులు, రివార్డులను కూడా కైవసం చేసుకుంది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2'ను శంకర్ తెరకెక్కించనున్నారు. 
 
ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు తెలిసింది. మొదటి పార్ట్‌లోలాగానే ఇందులో కూడా అవినీతి నిర్మూలన అనే కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాను తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో తీయాలని చిత్ర నిర్మాత భావిస్తున్నట్టు తెలిసింది.
 
శంకర్ దర్శకత్వంలో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో 'భారతీయుడు 2' త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తాజాగా వెల్లడించారు. ఈ సినిమాకుగాను డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌లతో కలసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం శంకర్ "2.0" సినిమా షూటింగ్‌లో బిజీ ఉండగా, కమల్ "విశ్వరూపం 2", "శభాష్ నాయుడు" చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి కాగానే 'భారతీయుడు 2' సెట్స్‌పైకి వెళ్తుంది.