నటీనటులు: అడివి శేష్, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్-రేవతి-మురళీ శర్మ-శోభిత ధూళిపాళ్ల తదితరులు
సాంకేతికతః ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, మాటలు: అబ్బూరి రవి, కథ-స్క్రీన్ ప్లే: అడివి శేష్, నిర్మాతలు: మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్-అనురాగ్ రెడ్డి-శరత్ చంద్ర, దర్శకత్వం: శశికిరణ్ తిక్కా
ఇటీవల బయోపిక్‌లు తెలుగులో వస్తున్నాయి. అవి ప్రేక్షకులకే నచ్చుతున్నాయి. ఆ క్రమంలో ఈరోజే విడుదలైన చిత్రం మేజర్. తాజ్ హోటల్‌లో 26/11 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమిది. అడవి శేష్ అతని టీమ్ చేసిన ఈ ప్రయత్నంతో తమపై తమకు నమ్మకంతో విడుదలకుముందుగానే దేశంలో పలుచోట్ల ప్రివ్యూ ప్రదర్శించేశారు. గూఢచారి తర్వాత దర్శకుడు చేసిన చిత్రమిది. అదెలా వుందో తెలుసుకుందాం.
కథ:
సందీప్ (అడివి శేష్) చిన్నతనంనుంచి స్పురద్రూపి. తననుకున్నదే చేస్తాడు. పక్కవారు ఆపదలో వుంటే కాపాడే ప్రయత్నం చేస్తాడు. అతని తండ్రి ఉన్నికృష్ణన్ (ప్రకాష్‌రాజ్) ఇస్రో అధికారి. కొడుకును ఇంజనీర్ చేయాలని అనుకుంటాడు. కూతురును డాక్టర్ చేయాలనుకుంటాడు. కానీ సందీప్ చిన్నతనం నుంచి ఇంగ్లీషు రోబో సినిమాలు చూసి స్పూర్తి పొంది తాను ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనుకుంటాడు. తండ్రికి నచ్చదు. అయినా తెలీయకుండా అప్లికేషన్ పెట్టడం నేవీ వారు తిరస్కరించడం జరుగుతుంది. ఫైనల్‌గా మిలట్రీలో వెళతాడు. దేశంకోసం పనిచేసే సోల్జర్ (సైనికుడు) కావాలన్నది అతని ఎయిమ్. స్కూల్ డేస్‌నుంచి ప్రేమిస్తున్న ఇషా (సయీ మంజ్రేకర్)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత భార్యతో సమయం కేటాయించలేకపోతాడు. దేశం, ప్రజలు అంటూ మిలట్రీలోవుండడంతో విసుగుచెందిన ఇషా విడాకులు కోరుకుంటుంది. లీవ్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, ఆ సమయంలోనే ముంబయిలో తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి జరిపారని హోటల్లో వందల మందిని బందీలుగా తీసుకున్నారని సందేశం రావడంతో వెంటనే తాను ట్రైనింగ్ అధికారి అయినా సరే, ఆపరేషన్‌లో పాల్గొనేలా పై అధికారి మురళీశర్మను ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ:
బయోపిక్‌లు అంటే వారు చేసిన మంచిపనులు, చెడ్డ పనులు చూపించాలి. సావిత్రి, గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ వంటి సినిమాలు తీస్తే అందులో వాస్తవం ఎంతుంటుందో కల్పితం కూడా అంతే వుంటుంది. లేదంటే ఓ వర్గం మనోభావాలు తెబ్బతిన్నాయని యాగీ చేస్తారు. ఇక్కడ మేజర్‌లో అది వుండదు. మేజర్ కథ అందరికీ తెలిసిందే. ఆయన కథను పోరాటాలను సి.బి.ఎస్.సి. సిలబస్‌లో ఓ భాగంగా కూడా పెట్టారు. అందుకే లిబర్టీ తీసుకోకుండా చిన్నచిన్న విషయాలు కల్పితం అయినా ఉన్న కథను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు.
అయితే ఇందులో తల్లిదండ్రుల ఎమోషన్, భార్య భావోద్వేగాలు కీలకం. కొడుకు తమ కళ్ళముందు వుండడం కన్నా దేశం కోసం బోర్డర్ దగ్గరకు వెళ్లడం రుచించకపోయినా మనోధైర్యంలో గడిపిన ప్రకాష్‌రాజ్, రేవతి పాత్రలు న్యాయం చేశాయి. ప్రేమించినవాడు దూరంగా వుండడంవల్ల తానేం కోల్పోయిందో ఇషా పాత్ర ద్వారా చూపించాడు. నిజాయితీ తీసిన ఈ కథలో తాజ్‌హోటల్‌లో జరిగిన సంఘటన సినిమాకు కీలకం. అంతకుముందు పలు చిత్రాలు వచ్చాయి. రామ్‌గోపాల్ వర్మ తీశాడు. బాలీవుడ్‌లో మరికొందరు తీశారు. కేవలం తాజ్ సంఘటన ఆధారంగానే తీశారు. కానీ మేజర్ సినిమా అమరవీరుడైన మేజర్ కథ తీయడం ప్రథమం..
మిలట్రీలో అధికారులు, ట్రైనింగ్ సహోదరులు ఎలా బిహేవ్ చేస్తారో ఇందులో చక్కగా చూపించారు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగున్నాయి. సందీప్ తాజ్ హోటల్‌లో ఉగ్రవాదుల దాడిపై చేసిన ఆపరేషన్ సక్సెస్‌గా సాగేలా తీశాడు. అందులో క్విక్ నిర్ణయాలు తీసుకునే విధానం బాగుంది. ఇక . ప్రేమకథలో ఎక్కడా హద్దులు దాటిపోలేదు. అతను సైన్యంలో చేరాక డ్రామా మొదలై కథనం వేగం పుంజుకుంటుంది. ఒక సైనికుడు తన వృత్తిని.. కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక ఎలా సతమతం అవుతాడో చూపించాడు.
మొదటి భాగంలోనే ఎమోషన్‌తో ప్రేక్షకుడిని ఇన్‌వాల్వ్ చేశాడు దర్శకుడు. సెకండాఫ్‌లో కేవలం తాజ్ హోటల్‌లో ఉగ్రవాదులు పదుల సంఖ్యలో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరపడం అందుకే పై అధికారి ఆదేశంతో మేజర్ సందీప్ వారిని ఎదుర్కోవడం అన్నీ బాగానే వున్నాయి.
ఆలోచించాల్సిన అంశాలు
- అయితే ఫైనల్‌గా ఈ సినిమా చూస్తే, సందీప్ దేశంకోసం చేసే చురుకైన నిర్ణయాలు ఒక్కోసారి తన ప్రాణంమీదకు వస్తాయని తెలిసినా వెనుకడుగువేయకపోవడం. ప్రధానంగా పాకిస్తాన్ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు ఎన్.జి.ఎ. టీమ్ ఏవిధంగా కష్డపడుతుందీ అనేది వివరింగా చూపాడు. మామూలుగా అయితే తీవ్రవాదుల్ని ప్రజలనుంచి కాపాడడం కేంద్ర బలగాలకు పెద్ద విషయం కాదు అనేది ఇందులో చూపించారు. కానీ ఆపరేషన్ ఫెయిల్ కావడానికి తీవ్రవాదులు ఎప్పటికప్పుడు ఎలెర్ట్‌గా వుండడానికి కారణం మాత్రం మీడియానే. అసలు హంతకులు వారే అనేంతలా కొన్ని సన్నివేశాలుంటాయి.
- మీడియా ఉదంతమే సినిమాలో విలన్ అనుకునేలా వున్నాయి. తాజ్ ఆపరేషన్ కోసం ముందుగా ముంబై పోలీసులు వెళ్లడం ఫెయిల్‌కావడం జరుగుతుంది. ఆ తర్వాత కేంద్ర బలగాలు రావడం నుంచి వారు ఎలా వస్తున్నారు. ఎటువంటి ఆయుధాలతో వున్నారు. అనే వివరాలను పలు మీడియా ఛానల్స్ తెలియజేయడం, ఏ గన్ ఎలా తయారయింది. దాన్ని నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలనే కథలు కథలుగా పలు టీవీ మాధ్యమాలు ప్రచారం చేయడంతో వీటి ఆధారంగానే ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ఎలెర్ట్‌గా వుండడం జరుగుతుంది. దీనిపై సందీప్ మీడియాతో చెప్పే డైలాగ్‌లు అద్భుతం. కానీ మళ్ళీ మామూలే. ఆఖరికి మీడియా ఇచ్చిన ప్రతి కదలిక వల్లే మేజర్ చనిపోయాడనేది సినిమా చూస్తే అర్థమవుతుంది.
- నటీనటులుగా చూస్తే, ఎవరి పాత్రలు వారు బాగా పండించారు. సీరియస్‌గా తమ కథతో తాము నటిస్తున్నట్లు నటించారు. ప్రకాష్‌రాజ్, రేవతి పాత్రలు క్లయిమాక్స్‌లో ఆకట్టుకుంటాయి. ప్రకాష్‌రాజ్ తన కొడుకు చనిపోయాక దేశమంతా సెల్యూట్ చేస్తుంటే హృదయాన్ని టచ్ చేస్తుంది. అశోక చక్ర బిరుదు ఇచ్చాక తన కొడుకు గురించి ఇచ్చి స్పీచ్ బాగుంది. డైలాగ్స్ పరంగా అబ్బూరి రవి బాగానే రాశాడు. సంగీతం బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ.. ఎడిటింగ్ కూడా అత్యుత్తమ ప్రమాణాలతో సాగాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. అయితే ఇలాంటి సినిమాను ఇంకా హత్తుకునేట్లు తీయగలిగితే బాగుండేది. ఫైనల్‌గా ఇటువంటి సినిమా తీసి ప్రజల్లో దేశభక్తి చేసేలా చేసే ప్రయత్నం అభినందించాలి. అమరవీరుడిని నివాళి అర్పించాలి.
రేటింగ్- 3/5