శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (14:56 IST)

కాసుల వర్షం కురిపిస్తున్న 'గీత గోవిందం'

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరును ఓవర

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేనా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరును ఓవర్సీస్‌లో కూడా కొనసాగిస్తోంది.
 
ఇప్పటికే ఓవరాల్‌గా రూ.75కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు దాటేసిన ఈ చిత్రం.. తాజాగా అమెరికాలో రెండు మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీన విడుదలైన 'గీత గోవిందం' తొలి రోజు నుంచీ ప్రభంజనం సృష్టిస్తోంది. 
 
'అర్జున్‌రెడ్డి' తర్వాత విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా విజయ్‌ తొలిసారిగా కుటుంబ నేపథ్యంలో చేసిన సినిమా కావడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. దీంతో యూనిట్‌ ఈ చిత్రం విజయంపై తొలి నుంచీ ధీమాగా ఉంది.
 
అందరి అంచనాలను నిజం చేస్తూ 'గీత గోవిందం' బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. దీంతో ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరినట్లు సినీ విశ్లేషకుడు రమేష్‌ బాలా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం దెబ్బకు బాలీవుడ్ చిత్రాలకు సైతం కలెక్షన్లు పడిపోయాయి. 
 
కాగా, 'గీత గోవిందం' సినిమాకు పరుశురాం దర్శకత్వం వహించారు. జీఏ2 (గీతా ఆర్ట్స్ 2) పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్‌ సినిమాను సమర్పించారు. గోపీ సుందర్‌ బాణీలు అందించారు. రష్మిక మందన్న హావభావాలకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.