శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (09:34 IST)

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ .. ధూల్‌పేట టు ఆస్కార్ వేదిక

rahul sipligunj
రాహుల్ సిప్లిగంజ్.. ఓ గల్లీ సింగర్. హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేట, మంగళ్‌పేట గల్లీల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆడుతూపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా, వినాయక ఉత్సవాల్లో తన స్నేహితులతో కలిసి నోటికొచ్చినట్టు పాటలు పాడుతూ ఉండేవాడు. అలాంటి కుర్రోడు ఇపుడు ఆస్కార్ వేదికపై మెరిచాడు. 
 
ధూల్‌పేట పాత బస్తీలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాహుల్ సిప్లిగంజ్‌కు చిన్నతనం నుంచే పాటలు పాడటంపై ఆసక్తి ఉంది. అదే అతన్ని ఈ స్థాయికి చేర్చింది. రాహుల్‌ను ఉన్నత చదువులు చదివించాలని ఆయన తండ్రి భావించగా, రాహుల్ మాత్రం పాటలు పాడటంపై ఆసక్తి చూపించేవాడు. దీన్ని గమనించిన రాహుల్ తండ్రి.. తన కుమారుడిని వెన్నుతట్టి ప్రోత్సహించేగానీ నిరుత్సాహపరచలేదు. రాహుల్ ఓ వైపు పాటల ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు, నాంపల్లిలోని వారి బార్బర్ షాపులో పని చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. 
 
రాహుల్‌కు తొలిసారి అక్కినేని నాగచైతన్య నటించిన "కాలేజీ బుల్లోడా" అనే చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు కీరవాణి, రాహుల్ ప్రతిభను గుర్తించి "దమ్ము" చిత్రంలో వాస్తు బాగుందే అనే పాటను పాడించారు. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో పాటలు పాడిన రాహుల్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నాడు. "ఆర్ఆర్ఆర్" చిత్రంలో నాటు నాటు పాటతో రాహుల్ ఒక గాయకుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.