సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (10:48 IST)

నాకంటే ముందు ఐశ్వర్య లక్ష్మీ క‌థ వింది - తండ్రి పాత్ర స‌స్పెన్స్ - సాయి ప‌ల్ల‌వి

Sai Pallavi
Sai Pallavi
సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న త‌మిళ సినిమా 'గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జూలై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సాయి ప‌ల్ల‌వి మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు...
 
గార్గి మూవీ కథ బాగా నచ్చింది. తండ్రీ కూతుర్ల అనుబంధం చుట్టూ సాగే కథ. న్యాయ వ్యవస్థపై పోరాటం కనిపిస్తుంది. నిత్యం మనకు ఎదురయ్యే ఘటనలే తెరపై కనిపిస్తాయి. అందుకే అందరూ కనెక్ట్‌ అవుతారనిపించింది. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలి? ఎంత చేయాలి? ఎంత వరకు చేయవచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేశాను.
 
- ఇందులో నా తండ్రి పాత్ర టీజ‌ర్‌లో క‌నిపించీక‌నిపించ‌కుండా చూపించారు. అది ఎవ‌ర‌నేది స‌స్పెన్స్‌. ప్ర‌ముఖ న‌టుడు న‌టించాడు. త్వ‌ర‌లో మీరు వెండితెర‌పై చూడాల్సిందే. 
 
నేను ఇది వరకు ఫిదా, లవ్ స్టోరి, విరాటపర్వం సినిమాల్లో తండ్రి, కూతుళ్ల కథలో నటించాను. కానీ గార్గీ సినిమాలో ఉండే భావోద్వేగం డిఫరెంట్‌గా ఉంటుంది. గత చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే క్యారెక్టర్ పోషించాను. యుముడితో పోరాటం చేసి సావిత్రి భర్త ప్రాణాలు దక్కించుకొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం నేను న్యాయపోరాటం చేస్తాను.
 
గార్గీ అంటే పురాణాల్లోని ఓ క్యారెక్టర్. ఒక సమయంలో పురుషుడికి పవర్, అవకాశాలు ఉన్నాయనే భావన ఉండేది. సమకాలీన సమయంలో మహిళలకు కూడా సమాన భాగం ఉండే ఒక వెసులుబాటు ఉంటుంది. ఈ కథలో గార్గీ పాత్రకు కూడా అలానే ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలో నేను టీచర్ పాత్రను పోషించాను. టీచర్ ఎలా ఉంటుందనే కాకుండా కుటుంబంలో ఉండే సమస్య గురించి కథ ఎక్కువగా ట్రావెల్ అవుతుంది.
 
గార్గి సినిమా కథ ముందుగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ వద్దకు వెళ్లింది. కథ గురించిన తెలిసిన తర్వాత తన సోదరుడు, దర్శకుడు గౌతమ్‌తో కలిసి ఐశ్వర్య లక్ష్మీ నిర్మించింది. ఒక హీరోయిన్ అయి ఉండి.. నా కోసం ఈ సినిమాను నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
 
సమాజంలోని మార్పు కోసం సినిమా చేయాలన్నది గార్గి ఉద్దేశం కాదు. ఒక సినిమా మాదిరిగానే చూడండి. మీ మనసులోకి ఈ సినిమా వెళ్లిపోయి ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది.
 
ఇటీవల ఈ సినిమాను సూర్య చూశారు. సూర్య ఈ సినిమా చూడగానే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి.. ఈ సినిమాను నేను రిలీజ్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జ్యోతిక వచ్చి నేను కూడా ఈ సినిమాలో భాగమవుతానని అన్నారు.
 
గార్గి సినిమాలో సూర్య, జ్యోతిక భాగమైన తర్వాత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ముందుగా నాకు ఎందుకు సినిమా చూపించలేదు. నేను కూడా ఈ సినిమాలో భాగమయ్యే వాడిని. అయినా ఈ సినిమాకు నా ప్రోత్సాహం ఉంటుంది అని చెప్పారు. తెలుగులో కూడా ఓ మంచి హీరో ఆ బాధ్యత తీసుకొంటే బాగుంటుందనిపించింది. వెంటనే రానాకు ఫోన్‌ చేశాను. ఆయన నా మాట పూర్తవ్వకుండానే ఈ చిత్రానికి ఎలాంటి స‌హాయం కావాల‌న్నా చేస్తాను అని చెప్పారు. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. మలయాళంలో తమిళ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం.
 
వరుసగా సీరియస్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నాను. వీటికి బ్రేక్‌ ఇవ్వాలనిపిస్తుంది. సరదాగా ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ సినిమా చేయాలనుంది. ఈ మధ్య మంచి డాన్స్‌ నంబర్‌ కూడా పడలేదు. రెండుమూడు సినిమాల నుంచీ.. డాన్స్‌ పాటలేం చేయలేదు. దానిని చాలా మిస్‌ అవుతున్నా. త్వరలోనే అదిరిపోయే డాన్స్‌ నెంబర్‌ చేయాలని ఉంది. వచ్చే సినిమాతో తప్పకుండా ఆ లోటు తీర్చుకొంటాను అని ఇంట‌ర్య్వూ ముగించారు.