శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (18:19 IST)

షూటింగ్ చూసేందుకు ఎగబడిన జనం... కరోనా భయంతో లోకేషన్‌ను వీడిన శృతిహాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతిహాసన్‌కు కరోనా వైరస్ అంటే చచ్చేటంతటి భయమని తెలుస్తోంది. తాను పాల్గొంటున్న ఓ చిత్రం షూటింగును చూసేందుకు వచ్చిన స్థానికులను చూసి.. కరోనా భయంతో షూటింగ్ లొకేషన్‌ను వీడి వెళ్లిపోయింది. పైగా, ముఖానికి మాస్కులు ధరించని వారిని చూస్తే తనకు ఎక్కడలేని కోపమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ హీరో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో నిర్మితమవుతున్న 'లాభం' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి సెట్ నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
అయితే, షూటింగ్ స్పాట్ నుంచి ఆమె అర్థాంతరంగా వెళ్ళిపోవడంపై పలు రకాలైన వార్తలు రావడంతో ఆమె స్పందించింది. కరోనా వల్ల అందరికీ ప్రమాదం ఉందని, అందుకే వెళ్లిపోయానని ఆమె తాజాగా వివరించి చెప్పింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్‌ అనంతరం ఇచ్చిన సడలింపులతో షూటింగ్‌ ప్రారంభించిన సమయంలో సెట్‌లో అన్ని జాగ్రత్తలు పాటించేవాళ్లమని, అయితే, క్రమంగా ప్రజలు కరోనాని సాధారణంగా తీసుకుంటున్నారని చెప్పింది.
 
కరోనా అంటే అది చిన్న జలుబు కాదని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుందని చెప్పింది. వ్యక్తిగతంగా ఎవరి జాగ్రత్తలు వాళ్లు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కొందరు కనీసం మాస్క్‌ కూడా సరిగ్గా ధరించట్లేదని తెలిపింది. తనకు అటువంటి వాళ్లని చూస్తే కోపం వస్తుందని చెప్పింది. లాక్డౌన్‌ వల్ల ఇప్పటికే తాను ఒకసారి బ్రేక్‌ తీసుకున్నానని తెలిపింది. కాగా, ఆమె ప్రస్తుతం తెలుగులో గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపుదిద్దుకుంటోన్న 'క్రాక్'‌ సినిమాలోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.