మీటూపై స్పందిస్తా.. పోకిరి చిత్రం అలా నిలిచిపోయింది : ఇలియానా
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్(సి.వి.ఎం) నిర్మిస్తోన్న చిత్రం "అమర్ అక్బర్ ఆంటొని". ఈ చిత్రం నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల దగ్గరపడడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఇలియానా మీడియాతో ముచ్చటించారు.
ఈ సమావేశంలో చిత్ర విశేషాలతో పాటు తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదో కూడా ఇలియానా తెలిపింది. ముఖ్యంగా మీటూపై ఆమె స్పందిస్తూ, 'స్త్రీ కావచ్చు.. పురుషుడు కావచ్చు. ఎవరైనా లైంగిక వేధింపులను అనుభవించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం చాలా మంచి విషయం. ఇది ఒక భయానిక అనుభవం. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే ఇలాంటి సమస్యలు తీరుతాయి. లేదంటే ఇటువంటి పరిస్థితులు అన్ని చోట్లా ఉదృతం అవుతాయి. ఇలాంటి సమస్యపై నేను స్పందించాల్సిన సమయంలో ఖచ్చితంగా స్పందిస్తాను' అని చెప్పుకొచ్చింది.
ఉదాహరణకు 'పోకిరి' సినిమా చేసేటప్పుడు అది అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. నేను పోకిరి చేయకూడదని అనుకుంటున్న సమయంలో మంజులగారు నాతో మాట్లాడి ఒప్పించారు. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా పోకిరి నిలిచింది. అలా కొన్ని సినిమాలు నేను ఇష్టపడి చేసినవి.. నిరాశ పరిచాయి. అన్నింటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే వెళుతున్నాను' అని ఇలియానా చెప్పుకొచ్చింది.