గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (13:55 IST)

మెప్పించే కార్తికేయ 2 - రివ్యూ రిపోర్ట్‌

kartikeya2
kartikeya2
తారాగ‌ణం: నిఖిల్ సిద్దార్థ-అనుపమ పరమేశ్వరన్-ఆదిత్య మేనన్-శ్రీనివాసరెడ్డి-వైవా హర్ష-సత్య-ప్రవీణ్-తులసి తదితరులు
సాంకేతిక‌తః సంగీతం: కాలభైరవ, మాటలు-కథా విస్తరణ: మణిబాబు కరణం,  నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్-టి.జి.విశ్వప్రసాద్,  కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందూ మొండేటి
 
గ‌తంలో హీరో నిఖిల్,  దర్శకుడు చందూ మొండేటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం కార్తికేయ‌. ఆ చిత్రం ప్రేక్ష‌కులు ఆద‌రించారు. వినూత్న‌మైన క‌థ‌గా ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించాడు. ఎనిమిదేళ్ళ త‌ర్వాత మ‌ర‌లా సీక్వెల్‌గా కార్తికేయ‌2 పేరుతో తీసిన సినిమా ఇది. అప్ప‌ట్లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి నిధి గురించి చ‌ర్చించిన ద‌ర్శ‌కుడు ఈసారి కృష్తత‌త్త్వంతోకూడిన నిధిలాంటి కంక‌ణం క‌నిగొనే ప్ర‌య‌త్నంలో చేశాడు. మ‌రి అది ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 
కార్తికేయ (నిఖిల్ సిద్దార్థ) ఎంబీబీఎస్ చ‌దివిన డాక్ట‌ర్‌. ప్ర‌తీదీ  శాస్త్రీయ దృక్పథంతో చూస్తాడు. దేవుడిని పెద్ద‌గా విశ్వ‌సించ‌డు.. మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తుంటాడు. అలాంటి కార్తికేయ‌కు పాముల బాష తెలుసుకుంటాడు. ఆ త‌ర్వాత ఇంట్లో తుల‌సిచెట్టును నంది కూల్చివేయ‌డంతో అశుభంతో హోమం చేయిస్తుంది కార్తికేయ త‌ల్లి తుల‌సి. అప్పుడు పూజారి మొక్కు గురించి గుర్తుచేయ‌డంతో కార్తికేయ‌ను తీసుకుని  ద్వారకకు వెళుతుంది. అక్కడ అతడికి కొన్ని అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. ఒక ఆర్కియాలజిస్ట్ తనకో బాధ్యతను అప్పగించి ప్రాణాలు కోల్పోతాడు. అతణ్ని హత్య చేసిన నేరం కార్తికేయ మీద మోపి పోలీసులు అతడి వెంట పడతారు. వారి నుంచి తప్పించుకునే క్ర‌మంలో కార్తికేయ‌కు త‌న వ‌ల్ల ఏదో బాధ్య‌త నెర‌వేరాల్సివుంద‌ని తెలుస్తుంది. అది ఏమిటి? ఆ త‌ర్వాత ఏమ‌యింది? అన్న‌ది క‌థ‌.
 
విశ్లేషణ:
 
రిలీజ్‌కుముందుగానే కృష్ణ‌త‌త్త్వం గురించి ద‌ర్శ‌కుడు పాయింట్ చెప్ప‌డంతో ఆస‌క్తిగా అనిపించింది. క‌థ ఆరంభంలోనే పురాణాలు, ఇతిహాసాలు అంటూ మ‌న భార‌తీయ‌మూలాల గురించి సైన్స్ గురించి, మునులు, రుషులు దేశ ప్ర‌జ‌ల‌కోసం ఎన్నెన్ని కొత్త విష‌యాలు క‌నిపెట్టారో మాట‌ల రూపంలో చెప్పేస్తాడు. అందులోనిది ద్వాప‌ర‌యుగంలో శ్రీ‌కృష్ణుడు త‌న కాలికి వున్న కంకణాన్ని శిష్యుడికి ఇచ్చి క‌లియుగంలో నీ ద్వారా ధ‌ర్మం ర‌క్షింప‌బ‌డాల‌ని శాసిస్తాడు. ఆ త‌ర్వాత జ‌రిగే క‌థే కార్తికేయ‌తో న‌డిచే క‌థ‌నం.
 
ఇందులో ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా వుంటుంది. మ‌న దేశ‌మూలాల గురించి మేథావులు క‌నిపెట్టిన ప‌లు విష‌యాల గురించి చ‌ర్చించాడు.  సీక్వెల్ కోసం మళ్లీ ఇంకో ఆసక్తికర కథను తీర్చిదిద్దుకున్నాడు. ఈసారి   కథలోకి భారీతనంతో రెండు సినిమాలు తీసేంత కంటెంట్ క‌నిపిస్తుంది. ఆ కాలంలోనే కృష్ణుడిని న‌మ్మే దోపిడీ దారులయిన అభీరులుకు కృష్ణుడు న‌మ్మే మాన‌వుల మ‌ధ్య యుద్ధం జ‌రిగి వేలాదిమంది చ‌నిపోతారు. ద‌ర్శ‌కుడు క‌థ‌ని మూలంలోకి వెళ్ళి ప‌లు గ్రంథాలు సోధించిన‌ట్లుంది.
 
- అయితే ఏదో చేయ‌పోతే ఏదో అయిన‌ట్లుగా సినిమాలో ఓ డైలాగ్ వుంటుంది. అలాగే సినిమా అంతా చూశాక కాస్త ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ క‌న్‌ఫ్యూజ్‌కు గుర‌వుతారు. శాస్త్రీయ‌ప‌దాలు, కృష్ణ‌త‌త్త్వం వంటికి వారికి పెద్ద‌గా తెలీవు. కానీ, పుర‌ణాల్లో భ‌విష్య‌త్ కాలాల్లో క‌లియుగంలోకూడా వ‌చ్చే ఉప‌ద్ర‌వాలు, రోగాలు, వినాశ‌నాలు వ‌స్తే ఏవిధంగా మాన‌వ‌జాతి కాపాడుకోవాల‌నేది కృష్ణ‌త‌త్త్వంలో చెప్పాడు ద‌ర్శ‌కుడు.  'కార్తికేయ' థీమ్ ను కొనసాగిస్తూ ఒక కొత్త కథను చెప్పే ప్రయత్నం చేశాడు. క‌థ‌ను మొద‌టి భాగం సుబ్రహ్మణ్యపురం నుంచి కథను రెండో భాగంలో ద్వారకకు తీసుకెళ్లాడు. 'కార్తికేయ'లో ఒక ఊరిలో జరిగే వింత ఘటనల తాలూకు మిస్టరీని ఛేదించే హీరో.. ఈసారి దేశం కోసం ఒక లక్ష్యంతో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురయ్యే అనుభవాల సమాహారమే సినిమా. 
 
ఇందులో హిమాచ‌లం, ద్వార‌క వంటి ప‌లు ప్రాంతాల్లో షూటింగ్ చేయ‌డంతో ప్రేక్ష‌కుడికి కొత్త అనుభూతి క‌లుగుతుంది. అబ్బుర‌ప‌రిచే స‌న్నివేశాలు వున్నాయి. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా, త‌ర్వాత ఏమ‌వుతుంద‌నేది ఊహ‌కు అంద‌కుండా ద‌ర్శ‌కుడు చేయ‌గ‌లిగాడు. అందుకే ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లను దర్శకుడు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు. ఒక పెద్ద హీరో సినిమాగా  భారీ లొకేషన్లు.. సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. దీనికి మ‌రో కొన‌సాగిపుకూడా వుంద‌నేలా ముగింపు ఇచ్చాడు.
 
అభిన‌య‌ప‌రంగా
'కార్తికేయస‌  సక్సెస్ తర్వాత  నిఖిల్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అది ఈ పాత్రలో క‌నిపిస్తుంది.  స్వాతి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా బాగానే చేసింది.  శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలో రాణించాడు. వైవా హర్ష పాత్ర అల‌రిస్తుంది. ఇక మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిధిమేర‌కే న‌టించారు.అభీరుడి పాత్రలో చేసిన నటుడు ఆకట్టుకున్నాడు.
 
 సాంకేతిక వర్గం: కాలభైరవ సంగీతం ప‌ర్వాలేదు. కంటెంట్ సినిమా కాబ‌ట్టి పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు.  థ్రిల్లింగ్ సీన్లలో రీరికార్డింగ్ పరంగా ఉండాల్సిన ఎగ్జైట్మెంట్.. హడావుడి కనిపించలేదు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. భారీ లొకేషన్లలో చిత్రీకరించిన సినిమాలో విజువల్స్ అల‌రిస్తాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. శ్రీకృష్ణుడి గొప్పదనాన్ని చాటే డైలాగ్స్ కూడా బాగా పేలాయి.   పురాణాలతో ముడిపెట్టి ఈ కథను అల్లుకున్న తీరు మెప్పిస్తుంది.
రేటింగ్ - 3/5