సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (18:10 IST)

జయలలిత బయోపిక్‌లు... మూడు..

సినీ పరిశ్రమలో బయోపిక్‌లు ఏ ముహూర్తంలో మొదలయ్యాయో కానీ... ఒక్క మహానటి సినిమా హిట్‌తో... పది రకాల బయోపిక్‌లు మొదలైపోయాయి... తర్వాత వచ్చిన బయోపిక్‌లలో ఏదీ ఆ మేరకు విజయం సాధించకపోయినప్పటికీ, బయోపిక్ తీయాలనే ఆశ మాత్రం సినీవర్గాలలో అలాగే కొనసాగుతూ పోతోంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఒక్క జీవితం ఆధారంగా మూడు బయోపిక్‌లు కూడా రానున్నాయి.
 
వివరాలలోకి వెళ్తే... బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తున్న ఈ తరుణంలో తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బయోపిక్‌లలో జయలలిత బయోపిక్‌ ఒకటి. అన్నింటిలోనూ విభిన్నంగా ఉండే పురచ్చితలైవి తన తదనంతర జీవితంలోనూ అదే విభిన్నతని కొనసాగిస్తూ, తన జీవితం ఆధారంగా ఒకటీ, రెండూ కాదు ఏకంగా మూడు సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారనే చెప్పుకోవచ్చు. ముగ్గురు దర్శకులు (ఏఎల్‌ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా) ఈ బయోపిక్‌లను అనౌన్స్‌ చేయడం తెలిసిన విషయమే. కాగా... ఆదివారం జయలలిత జయంతి సందర్భంగా సినిమా పరిశ్రమలోని ఆనవాయితీ ప్రకారం ఆయా సినిమాల టైటిల్స్‌ను, రిలీజ్‌ తేదీలను ప్రకటించారు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ రూపొందిస్తున్న చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసారు. తలైవి అంటే నాయకురాలు అని అర్థం. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారట.
 
జయలలిత పాత్రకి విద్యా బాలన్, నయనతార.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తూ ఉన్నప్పటికీ... దానిని ఎవరు పోషిస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథకు స్క్రిప్ట్‌ సూపర్‌వైజ్‌ చేయనున్నారు. ‘ఎన్టీఆర్, ‘83’ (1983 వరల్డ్‌ కప్‌) బయోపిక్‌ల నిర్మాత విబ్రీ మీడియా విష్ణు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుమారు తొమ్మిది నెలల పాటు ప్రీ–ప్రొడక్షన్‌ పనులు చేసాము, కథకు కావలసిన సమాచారాన్నంతటినీ సేకరించాము అని ‘తలైవి’ సినిమా యూనిట్ తెలిపింది. 
 
ఇక మరో దర్శకురాలు ప్రియదర్శిని సినిమా విషయానికి వస్తే.. ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌తో ఆవిడ రూపొందించబోయే సినిమాలో జయలలితగా నిత్యా మీనన్‌ నటిస్తారని ఎప్పుడో ప్రకటించేసారు. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న సినిమాని విడుదల చేస్తాము అని ప్రకటించారు. 
 
మూడో దర్శకుడు భారతీరాజా అనౌన్స్‌ చేసిన సినిమాలో, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో కనిపించనుండడం విశేషం కాగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇన్ని సినిమాలు, సిరీస్‌లు ఒకే వ్యక్తి జీవితంపై తెర మీదకు రావడం జయలలిత జీవితానికే సాధ్యమేమో మరి...