సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (14:55 IST)

నిడుదవోలు, గిడుగు కృష్ణ మూర్తిల మనవరాలు.. జయసుధ సినీ ప్రస్థానం.. సహజనటిగా?

jayasudha
సీనియర్ నటి జయసుధ పుట్టినరోజు నేడు. ఈమె 17 డిసెంబర్ 1958లో జన్మించారు. నటిగా, రాజకీయ నేతగా, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె రాణిస్తున్నారు. ప్రధానంగా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాలలో ఆమె నటించారు. జయసుధ సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే. జయసుధ ఏపీ సర్కారు నుంచి ఎనిమిది రాష్ట్ర నంది అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ అవార్డులను అందుకున్నారు.
 
జయసుధ  ప్రముఖ పండితులు, సాహిత్యవేత్త నిడుదవోలు వెంకటరావు, గిడుగు కృష్ణ మూర్తిల మనవరాలు. ఆమె మొదట ప్రముఖ సినీ నిర్మాత వడ్డే రమేష్ బావ రాజేంద్ర ప్రసాద్‌తో విజయవాడలో వివాహం జరిగింది. అయితే, వివాహం విడాకులతో ముగిసింది. తదనంతరం, ఆమె 1985లో నిర్మాత నితిన్ కపూర్‌ను వివాహం చేసుకుంది. ఈయన  నటుడు జీతేంద్రకు బంధువు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమారులు నిహార్, శ్రేయాన్ ఉన్నారు.
 
జయసుధకు రాధిక, జయప్రద బెస్ట్ ఫ్రెండ్స్. వారితో కలిసి జయసుధ అడవి రాముడు, మేఘసందేశం వంటి అనేక చిత్రాలలో నటించింది. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
కానీ ఎన్నికలలో ఓడిపోయి 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 3వ స్థానంలో నిలిచారు. ఆమె భర్త నితిన్ కపూర్ మార్చి 14, 2017న భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఒత్తిడిలో ఉన్నారని.. అయితే ఆత్మహత్యకు అసలు కారణం తెలియరాలేదు.
 
సినిమాలు..
జయసుధ తన పదమూడేళ్ల వయసులో పండంటి కాపురం (1972) అనే తెలుగు సినిమాలో జమున కూతురుగా సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకుడు కె. బాలచందర్ ఆమెకు తమిళ చిత్రం అరంగేత్రంలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు, అక్కడ ఆమె కమల్ హాసన్‌తో కలిసి నటించారు. ఇలా తెలుగు, తమిళభాషల్లో అనేక సినిమాలు చేశారు. ఎక్కువగా బాలచందర్ దర్శకత్వంలో; సొల్లతాన్ నినైక్కిరెన్ (1973), నాన్ అవనిల్లై (1974), అపూర్వ రాగంగల్ సినిమాలు హిట్ అయ్యాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ఇది కథ కాదు సినిమా ఆమె కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. 
 
అప్పటికే సుజాత అనే మరో నటి ఉండటంతో ఆమె తన పేరును జయసుధగా మార్చుకున్నారు. తెలుగు చిత్రం లక్ష్మణరేఖ (1975)లో కథానాయికగా ఆమె తొలి పాత్ర ద్వారా అభిమానులను ఆకట్టుకున్నారు. అంతేగాకుండా సహజనటి అనే బిరుదును ఆమెకు లభించేలా చేసింది. ఆపై 70టీస్ నుంచి 90 టీస్ వరకు సినిమాల్లో రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు జయసుధ.