చిరును ఆకాశానికెత్తేసిన దర్శకేంద్రుడు... ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఆకాశానికెత్తేశారు. ఆరు పదుల వయసులోనూ ఆయన నటన అత్యద్భుతం అని పేర్కొన్నారు. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన చిత్రం "సైరా నరసింహా రెడ్డి". రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం గాంధీ జయంతి రోజున గ్రాండ్‌గా విడుదలైంది.
తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. సినిమాని అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు, నాని, సుధీర్ బాబు వంటి స్టార్ సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ద్వారా చిరుతో పాటు చిత్ర బృందంకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్స్ చేశారు.
"దశాబ్దాల నుంచి చిరంజీవిని దగ్గరగా చూశాను. పని పట్ల ఆయనకున్న అంకితభావం, ఉత్సాహం ఇంకా తగ్గలేదని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ప్రతి అంశంలోను చక్కని నటన కనబరాడు. ఈ వయస్సులో ఇది ఆయన సాధించిన ఘనత అని చెప్పవచ్చు.
ఇకపోతే, దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ బాగుంది. ఈ సినిమా కోసం సురేందర్ పెట్టి అపారమైన కృషిని నేను చూశాను. ఇక ప్రీ క్లైమాక్స్ డ్యాన్స్ సీక్వెన్స్‌లో తమన్నా పర్‌ఫార్మెన్స్ బాగుంది. ఇంత పెద్ద విజయం సాధించినందుకు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. కొడుకు నుండి తండ్రి అందుకున్న సరైన బహుమతి ఇది' అని రాఘవేంద్ర రావు తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు.