గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (19:01 IST)

కమల్ హాసన్ - మణిరత్న కాంబోలో కొత్త చిత్రం... పేరు "థగ్ లైఫ్"

thuglife
విశ్వనటుడు కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‌‍లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి "థగ్ లైఫ్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 7వ తేదీన కమల్ హాసన్ పుట్టిన రోజు కావడంతో ఒక రోజు ముందుగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్‌లు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం. త్రిష హీరోయిన్. జయం రవి, దుల్కర్ సల్మాన్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇది కమల్ హాసన్‌కు 234వ చిత్రం కావడం గమనార్హం. 
 
ఈ మూవీకి 'థగ్‌ లైఫ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను నిర్మాణసంస్థ పంచుకుంది. గతంలో ‘థగ్స్‌ ఆఫ్ హిందూస్థాన్‌’ పేరుతో బాలీవుడ్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ చిత్రం వచ్చింది. మరి మణిరత్నం కూడా ఇదే కాన్సెప్ట్‌ను తన స్టైల్‌లో రూపొందిస్తారా లేదంటే సరికొత్త కథాంశంతో రానున్నారా అనేది తెలియాల్సి ఉంది.
 
ఇక ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో  అనేకమంది స్టార్‌ నటీనటులు అలరించనున్నారు. హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. కీలకపాత్రల్లో మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కనిపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయంపై త్రిష ట్వీట్ చేస్తూ.. ‘కలలు చాలా సార్లు నెరవేరినప్పుడు ఎంతో అదృష్టవంతులమని అనిపిస్తుంది. #KH234లో భాగం కావడం కమల్ హాసన్‌, మణిరత్నంలతో మరోసారి కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. యూనివర్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాలని ఉంది' అంటూ తన పోస్టర్‌ను షేర్‌ చేశారు.
 
కాగా, గతంలో మణిరత్నం, కమల్‌ హాసన్‌ల కాంబోలో తెరకెక్కి సూపర్‌ హిట్ అయిన చిత్రం ‘నాయకన్‌’. ఓ గ్యాంగ్‌స్టర్‌ జీవితాధారంగా రూపొందిన ఆ సినిమా 1987లో విడుదలై, ఘన విజయం అందుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబో రిపీట్‌ కానుండడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. కమల్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన దీని ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.