బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (09:09 IST)

తారకరత్న మృతిపై సంతాపాల వెల్లువ.. సీఎంలు జగన్, కేసీఆర్, మాజీ సీఎం బాబు

Tarakaratna
టాలీవుడ్ హీరో తారకరత్న మృతిపై సంతాపాలు వెల్లువెత్తున్నాయి. అటు సినీ, ఇటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాలను వెల్లడిస్తున్నారు. ఇందులోభాగంగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులు వేర్వేరు ప్రకటనలో తమ సంతాపాలను తెలిపారు. అలాగే, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. 
 
సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు తారకరత్న మృతి చెందిన నేపథ్యంలో సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేయాలని వెల్లడించింది. 
 
తారకరత్న మృతిపట్ల సీఎం కేసీఆర్ కూడా సంతాపం వెలిబుచ్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా తారకరత్న మృతిట్ల సంతాపం తెలిపారు. తారకరత్న మరణవార్తతో తీవ్ర విచారం కలిగిందని అన్నారు. 
 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, తారకరత్న కన్నుమూయడం బాధ కలిగించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, తారకరత్న అకాల మరణం పట్ల తీవ్ర వ్యక్తం చేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు చెప్పారు.