అఖిల ప్రియ కేసులో కొత్త కోణం.. సినీ ఫక్కీలో స్కెచ్.. స్పెషల్ చబ్బీస్‌లా...?

akhila priya reddy
akhila priya reddy
సెల్వి| Last Updated: బుధవారం, 13 జనవరి 2021 (09:46 IST)
హైదరాబాద్ నగరం నడిబొడ్డున కిడ్నాప్ జరగడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆ కిడ్నాప్ వ్యవహారంలో కేసీఆర్ బంధువులు వుండటం సంచలనంగా మారింది. దీని వెనక ఏపీ మాజీ మంత్రి హస్తం ఉండడంతో అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆమె విచారణల సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌లోని 48 ఎకరాల భూమి వ్యవహారంలో ప్రవీణ్ రావు ఫ్యామిలీకి, అఖిల ప్రియ ఫ్యామిలీకి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రవీణ్ రావు సోదరులను అఖిల్ ప్రియ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.

ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అఖిల ప్రియతో పాటు మరో ముగ్గురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మరికొందరిని విజయవాడ, గోవాలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నారు. వీరిలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కూడా ఉన్నారు. ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

అచ్చం సినిమా తరహాలో ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసేందుకు అఖిల ప్రియ గ్యాంగ్ స్కెచ్ వేసినట్లు తేలింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'స్పెషల్ చబ్బీస్' చిత్రంలో సీన్లను చూసి.. ఇక్కడ అమలు చేశారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించారు. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు.

ప్రవీణ్ రావు సోదరులను ఎలా కిడ్నాప్ చేయాలన్న దానిపై అఖిల్ ప్రియ గ్యాంగ్‌కు ఆమె భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చారు. స్పెషల్ చబ్బీస్ సినిమా సీన్లను చూపించి.. కిడ్నాప్ ఎలా చేయాలి? ఐటీ అధికారులుగా ఎలా నటించాలి? వారిని ఎలా నమ్మించాలి? అని రిహార్సల్స్ కూడా చేశారు. కిడ్నాప్‌కు సంబంధించి యూసుఫ్‌గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్ క్లాస్‌ కూడా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

అక్కడే స్పెషల్ చబ్బీస్ మూవీ సీన్లను తమ గ్యాంగ్ సభ్యులకు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రహాస్ చూపించారు. ఐటీ అధికారుల్లా కనిపించేందుకు.. కాస్ట్యూమ్స్, ఐడీ కార్డులు సిద్ధం చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఓ సినిమా కంపెనీ నుంచి ఐటీ అధికారుల డ్రెస్సులను అద్దెకు తీసుకున్నాడు. అంతా ఓకే అనుకున్నాకే.. ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేశారు.

కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అంతలోనే అడ్డంగా దొరికిపోయారు. మరోవైపు ఈ కేసులో ఏ 1 అఖిల ప్రియ విచారణ కొనసాగుతోంది. మంగళవారం దాదాపు 8 గంటల పాటు ఆమెను పోలీసులు ప్రశ్నించారు. పలు విషయాల గురించి సమాధానాలు రాబట్టారు. ఐతే మరికొన్నింటికి మాత్రం ఆమె నోరు విప్పడం లేదని తెలిసింది.దీనిపై మరింత చదవండి :