1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (09:55 IST)

పవన్ దిగిరావాలన్న కత్తి మహేష్: 15వరకు మౌనంగా వుండమన్న కోన.. ఎందుకు?

సెలెబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ముందుంటాడు. ప్రస్తుతం కత్తికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వివాదానికి తెరపడాలంటే.. పవన్ కల్యాణే రంగ

సెలెబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ముందుంటాడు. ప్రస్తుతం కత్తికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వివాదానికి తెరపడాలంటే.. పవన్ కల్యాణే రంగంలోకి దిగాలని కత్తి అంటున్నాడు.

ఓ టీవీ లైవ్ షోలో కత్తి మాట్లాడుతూ.. పవన్ ఫ్యాన్స్‌తో తన వార్ ఆగాలంటే.. పవన్ సీన్లోకి రావాలని.. ఆయన దిగిరావడం తప్ప వేరొక మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కోపం అంతా పవన్ అభిమానుల ఉన్మాద చర్యలపైనేనని కత్తి మహేష్ స్పష్టం చేశాడు. ఇక వివాదానికి పరిష్కారం పవన్ చేతుల్లోనే ఉందని తేల్చి చెప్పాడు.
 
పవన్ కల్యాణ్ అనేవాడు దిగివచ్చి అభిమానులను నియంత్రించుకోక తప్పదని, తనకు ఫోన్ రాకుండా ఉన్నప్పుడే తన పోరాటానికి ముగింపు పలికినట్లు అవుతుందని కత్తి మహేష్ వెల్లడించాడు. అంతేగానీ మధ్యలో ఎవరైనా వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తే వివాదం మరింత ముదురుతుందని హెచ్చరించాడు. పవన్ తన అభిమానులను నియంత్రించుకునేంత వరకు తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కత్తి మహేష్ అన్నాడు.
 
ఇదిలా ఉంటే.. కత్తి మహేష్- పవన్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదంలోకి ప్రముఖ సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్ ఎంటరయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పవన్ అభిమానులకు కోన వెంకట్ సూచన చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు అందరూ మౌనంగా ఉండాలని, మౌనం ఎప్పటికీ మోసం చేయదని పేర్కొన్నారు. పవన్ అభిమానులతోపాటు, కత్తి మహేశ్ కూడా మౌనంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
 
మీడియా హౌస్‌లకు వెళ్లి పవన్ అభిమానుల గురించి, పవన్ వ్యక్తిగత జీవితం గురించి వ్యతిరేక ప్రసంగాలు ఇవ్వవద్దని కత్తిని కోరారు. అలా చేసినట్టయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలనుకుంటున్న తన ప్రయత్నం విఫలమవుతుందన్నారు. కోన వెంకట్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. 15వ తేదీన ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది.