మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (12:00 IST)

ప్రభాస్ పెళ్లి ముచ్చట తీరకుండానే వెళ్లిపోయిన కృష్ణంరాజు

krishnamraju - prabhas
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు. ఆయన ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. మధుమేహంతో పాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆయన చనిపోయినట్టు హైదరాబాద్ ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఆయన మృతి వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. 
 
మరోవైపు, తన చిరకాల కోరిక తీరకుండానే ఆయన మరణించారు. తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ అంటే కృష్ణంరాజుకు ఎంతో ప్రేమ. ప్రభాస్ ను ఆయనే సినిమాల్లోకి తీసుకొచ్చారు. ప్రభాస్ ను వెనకుండి నడిపించి పెద్ద స్టార్‌ను చేశారు. వీరిద్దరూ తండ్రీకుమారులుగా ఉండేవారు. 
 
తనకు పెదనాన్న అంటేనే అందరి కంటే ఎక్కువ భయం అని ఎన్నో సందర్భాల్లో ప్రభాస్ చెప్పాడు. చిన్నప్పటి నుంచి పెదనాన్నను చూస్తూ పెరిగానని, ఆయనను చూసే ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పేవాడు. 
 
మరోవైపు, కృష్ణంరాజు ఎప్పుడు మాట్లాడినా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించేవారు. ప్రభాస్ కు మంచి అమ్మాయిని వెతుకుతున్నామని... త్వరలోనే శుభవార్త వింటారని చెపుతుండేవారు. 
 
ప్రభాస్ పెళ్లి కంటే తనకు సంతోషాన్ని ఇచ్చే అంశం మరొకటి లేదని చెప్పేవారు. ప్రభాస్ పిల్లలతో కూడా తనకు నటించాలనే కోరిక ఉందని అంటుండేవారు. అలాంటి కృష్ణంరాజు... ప్రభాస్ పెళ్లిని చూడకుండానే, తన చిరకాల వాంఛ తీరకుండానే తనువు చాలించారు.