ఖుష్బూ ప్రాణాలను కాపాడిన "లార్డ్ మురుగన్" ... కారు ప్రమాదంలో జస్ట్ ఎస్కేప్...
ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సినీ నటి ఖుష్బూకు బుధవారం తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక వైపు డోరు పూర్తిగా ధ్వంసమైంది.
అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందితో కలిసి వేల్ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం చెన్నై నగర శివారు ప్రాంతంలోని మధురాంతకం అనే ప్రాంతంలో సంభవించింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయపటిన ఖుష్బూతో పాటు.. కారులోని మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.
ఈ ప్రమాదం తర్వాత ఖుష్బూ ఓ ట్వీట్ చేస్తూ, ఈ రోజు జరిగిన కారు ప్రమాదంలో తమను మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) స్వామి ప్రాణాలతో కాపాడారని చెప్పుకొచ్చారు.