శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (16:03 IST)

ప్రకాష్ రాజ్‌కు తేరుకోలేని షాకిచ్చిన బండ్ల గణేష్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటుల సంఘమైన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. తాజాగా, నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు.
 
ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన నటుడు బండ్ల గణేశ్‌.. ఆ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. పైగా, ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా వరుస ట్వీట్లు చేశారు. బండ్ల గణేష్ ఈ విధంగా ట్విట్లు చేశారు.
 
'మాట తప్పను.. మడమ తిప్పను. నాది ఒకటే మాట - ఒకటే బాట. నమ్మడం - నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. ఘన విజయం సాధిస్తాను. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియచేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. ‘మా’ను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దాం.. అదే మా నిజమైన అభివృద్ధి.. చిహ్నం' అంటూ బండ్ల గణేశ్‌ ట్విట్లు చేశారు. ఈ ట్వీట్లు ఇపుడు సంచలనంగా మారాయి.