సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (13:50 IST)

మా వివాదం : డైరీ ఆవిష్కరణలో రచ్చ.. చిరంజీవిని టార్గెట్ చేసిన రాజశేఖర్

మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ (మా)లో ఇంటి గొడవలు మరోమారు బయటపడ్డాయి. ప్రతి యేడాది మా ఆధ్వర్యంలో నిర్వహించే మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి ప్రసంగానికి హీరో రాజశేఖర్ పదేపదే అడ్డుపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చిరంజీవి కాసింత అసహనానికి లోనయ్యారు. రాజశేఖర్ తనను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మా ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబు వంటి పెద్దపెద్ద హీరోలతో పాటు ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి, జీవిత రాజశేఖర్, జయసుధ తదితర నటీనటులంతా హాజరయ్యారు. 
 
ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సాయమైనా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా సాయం చేయాలని అడుగుదామన్నారు. పేద కళాకారులకు సాయం అందించాలని ఆయన అన్నారు.
 
ఆ తర్వాత రాజశేఖర్ తనపై చేసిన విమర్శలపై చిరంజీవి స్పందించారు. 'నేను ఇందాక చెప్పిన మాటలకు విలువే ఇవ్వలేదు. మంచి వుంటే మైక్‌లో చెప్పండి, చెడు వుంటే చెవిలో చెప్పుకుందామని అన్నాను. అది గౌరవం ఇవ్వలేని వారికి... నిజంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? పెద్దలుగా మేమంతా ఎందుకు ఉండాలి? ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం ఎలా ఉంటుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే' అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా, ఎంతో సజావుగా, హృద్యంగా సాగుతున్న సభలో, ఎగ్రసివ్‌గా మైక్ లాక్కుని, గౌరవం లేకుండా, ప్రొటోకాల్ లేకుండా, లాక్కుని చేయడం మర్యాద కాదని హితవు పలికారు. ఇప్పుడు కూడా తాను కోపంతో మాట్లాడే వాడిని కాదని, ఎంత సౌమ్యంగా మాట్లాడదామని అనుకున్నా, తనకు కోపం వచ్చేలా చేశారని చిరంజీవి వ్యాఖ్యానించారు. 
 
దయచేసి, ఇక ఆపేసి, మంచిని గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఎవరూ కోపావేశాలకు వెళ్లవద్దని, ఫ్యూచర్ ఎయిమ్ గురించి మాట్లాడుకుందామని అన్నారు. మీడియా దీని గురించి చిలువలు, పలువలుగా రాస్తుందని, అవసరమైన విషయాలను పక్కన పెడతారని అన్నారు.
 
ఆ సమయంలో మరోసారి కల్పించుకున్న రాజశేఖర్, తాను నిజాన్ని మాత్రమే మాట్లాడానని, తాను ఎవరి ముందూ తలవంచుకుని ఉండబోనని చెబుతూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం ముందుగా పక్కా ప్రణాళిక వేసుకుని వచ్చి చేశారని, కార్యక్రమాన్ని పాడు చేసే ఉద్దేశం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని చిరంజీవి మండిపడ్డారు.