ఆ స్టార్ హీరో అల్లుడు ఓ ఆటాడుకున్నాడు.. అమైరా దస్తూర్
బాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం అనేక మంది హీరోయిన్లకు ప్రేరణగా నిలుస్తోంది. ఈ ఉద్యమం కారణంగా సినిమా షూటింగ్‌లలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా అందాలభామ అమైరా దస్తూర్ పెదవి విప్పింది. సినీ రంగంలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించి సంచలనం సృష్టించింది. ఆ హీరో ఎవరో కాదని దక్షిణాదికి చెందిన ఓ స్టార్ హీరో అల్లుడని నర్మగర్భంగా ఆ వ్యక్తి పేరును వెల్లడించింది.
ఈ లైంగిక వేధింపులపై ఆమె స్పందిస్తూ, 'నాకు ఉత్తరాదిన, దక్షిణాదిన కూడా వేధింపులు ఎదురయ్యాయి. కాకపోతే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన ఎక్కువ వేధింపులకు గురయ్యాను. దక్షిణాదిన ఓ సినిమా చేస్తున్న సమయంలో హీరోతో పాట చేస్తున్నప్పుడు ఆ హీరో అనవసరంగా నా మీద చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడు. అదే విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళాను. ఇక అప్పటినుంచి నాకు నరకం చూపించారని వాపోయింది.
ముఖ్యంగా, షూటింగ్‌కి ఉదయం 8 గంటలకే రమ్మనేవారు. అప్పటినుంచీ రెడీ అయి కార్వన్‌లో కూర్చునేదాన్ని. ఎంత సేపైనా పిలిచేవారు కాదు. ఒక్కోసారి ఉదయం నుంచి కూర్చోబెట్టి సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్ చేసేవారు. మరొకసారి ఉదయం నుంచి సాయంత్రం వరకూ వెయిట్ చేయించారు. ఓ రోజు నాకు షూటింగ్ లేదు. అయినా ఆ విషయం నాకు ముందు చెప్పలేదు. సాయంత్రం పేకప్ చెప్పే సమయానికి చెప్పారు. దాంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం మొదలైందన్నారు.
ఆ వ్యక్తికి దక్షిణాదిన మంచి పలుకుబడి ఉంది. ఓ పెద్ద హీరోకి అల్లుడు. అతడి పేరు చెబితే నా కెరీర్‌ని నాశనం చేసేస్తారు. అదే నా భయం. అందుకే అతని పేరు ఇప్పుడు చెప్పను. ఏదో ఒకరోజు అతగాడి పేరు బయటపెడతాను. దక్షిణాదిన నాకు సినిమా అవకాశాలు రాకపోయినా నేను బాధపడను. కానీ ఆ హీరోని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని' అమైరా దస్తూర్ స్పష్టం చేసింది.