సారీ చెబుతావా.. కోర్టుకు లాగమంటావా? శృతికి అర్జున్ వార్నింగ్
లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు చేసిన కన్నడ నటి శృతి హరిహరన్‌కు యాక్షన్ కింగ్ అర్జున్ గట్టివార్నింగ్ ఇచ్చాడు. తనపై లేనిపోని ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో కోర్టులో దావా వేస్తానంటూ బహిరంగ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ శృతి హరిహరన్ ఏమాత్రం వెనక్కితగ్గలేదు. తాను బహిరంగ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమెపై కోర్టులో పరువు నష్టం దావా వేసేందుకు అర్జున్ సిద్ధమయ్యాడు.
'2016లో యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి తమిళ మూవీ "నిబునన్" సినిమా చేశాను. అప్పుడు ఓ రొమాంటిక్ సీన్‌లో అతను నన్ను కౌగిలించుకొని తడుముతుండటం నాకు అస్సలు నచ్చలేదు. కొన్ని భయంకరమైన సంఘటనలు కూడా నా దృష్టికి రాగా, వాటిని నుంచి తెలివిగా తప్పించుకోగలిగాను' అని మీటూ వేదికగా హీరోయిన్ శృతి హరిహరన్ ఆరోపించింది. దీంతో ఈ వివాదాన్ని చల్లబరిచేందుకు కర్నాటక ఫిల్మ్ చాంబర్ రంగంలోకి దిగింది.
ఛాంబర్ అధ్యక్షుడు, సీనియర్ నటుడు అంబరీష్ ఈ వివాదానికి స్వస్తి పెట్టాలని ఇద్దరిని పిలిచి ముఖాముఖి చర్చలు జరిపాడు. అయితే ఎంతగానో ప్రయత్నించినప్పటికి ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా మెట్టుదిగలేదు. అర్జున్ తనకి శృతి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరాడు.
దీనికి శృతి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 'నేను ఇప్పటికీ నా మాట మీదే నిలబడతాను. నాకు ఏది సరైనది అనిపిస్తుందో దాని కోసమే పోరాడతాను. నేను మాత్రం క్షమాపణలు చెప్పను' అని తేల్చి చెప్పింది.
'మీటూ' అనేది మహిళలు, యువతులకు మంచి వేదికని, కానీ దాన్ని దుర్వినియోగం చేయవద్దని, తనకు క్షమాపణ చెప్పకుంటే ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని శృతితో చెప్పేశాడు. తనపై ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో కూడా తనకు తెలియడం లేదని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు.