'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రానికి ప్రేక్షకుల కరవు... ఫ్రీగా టిక్కెట్ల పంపిణీ.. ఎక్కడ?
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. ఈ చిత్రం తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9వ తేదీ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించారు. అలాగే, వివిధ పాత్రల్లో నేటి యువతరం నటీనటులు నటించారు.
నిజానికి ఒక కొత్త సినిమా విడుదలవుతుందంటే ఆయా హీరోలు, దర్శకులు, హీరోయిన్ల అభిమానులు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి చేయడం ఆనవాయితీ. కానీ, 'ఎన్టీఆర్ కథానాయుడు' చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద ప్రేక్షకులు లేక వెలవెలపోతున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద ఉచితంగా టిక్కెట్లను పంపిణీ చేస్తున్నారు.
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న అలంకార్ థియేటర్‌లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను ప్రదర్శించారు. అయితే మొత్తం 400 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ థియేటర్ 200 సీట్లకు మించి నిండలేదు.
దీంతో బాలయ్య అభిమానులు చాలామందికి సినిమా టికెట్లను ఉచితంగా అందజేశారు. దీంతో టికెట్ అందుకున్న ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కల్యాణ్ రామ్, సుమంత్ నరేశ్, విద్యాబాలన్, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు.