పవన్ కళ్యాణ్‌కు నాకూ సూట్ కాదు : ఎస్ఎస్. రాజమౌళి (video)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన దర్శకత్వం వహిస్తే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్టూడెంట్ నంబర్ 1 నుంచి బాహుబలి-2 చిత్రం వరకు ఇది నిరూపితమైంది. అందుకే రాజమౌళితో పని చేసే ఛాన్స్ వస్తే మాత్రం ఏ ఒక్క హీరో లేదా హీరోయిన్ వదులుకోరు.
అలాంటి రాజమౌళి.. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఇదే ప్రశ్నను రాజామౌళి వద్ద ప్రస్తావిస్తే ఆయన సూటిగా సుత్తిలేకుండా సమాధానం చెప్పేశారు. పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయడం తనకు సెట్ కాదనీ చెప్పేశారు.
అలా ఎందుకు కాదో కూడా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. 'పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఈ విషయంలో ఆయనను గతంలో కలిశాను.. కానీ, కుదరలేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ వంటి వాటిపై ఉంది. సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది' అని చెప్పారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దృష్టంతా ప్రజాసేవపైనే కేంద్రీకృతమైవుంది.. ప్రజాసేవకే ఆయన తన సమయాన్నంతా కేటాయిస్తున్నారు. సినిమాలకు మాత్రం కొద్ది సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ, తాను పవన్ హీరోగా పెట్టి సినిమా తీయాలంటే మాత్రం ఈ సమయం సరిపోదు. ఎందుకంటే.. ఒక చిత్రాన్ని పూర్తి చేసేందుకు తాను ఎక్కువ సమయం తీసుకుంటానని, ఈ అంశంపై పవన్‌కు తనకు సూట్ కాదని వివరణ ఇచ్చారు.