పాన్ ఇండియా సినిమా జగన్... ప్రతీక్ గాంధీ హీరో
ఒత్తిడిని పెట్టిన కొద్ది... మనిషి బంతిలా పైకి లేస్తాడు... దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చిన్న వయసులోనే రాజకీయంగా అనేక ఒత్తిడులను ఎదుర్కొని... రాజకీయ మేరు పర్వతం లాంటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఢీకొన్నాడు వై.ఎస్. జగన్. తన తండ్రి పేరు మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి, దానిని తనదైన శైలిలో నడిపించి... వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి...చివరికి జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ దిగ్గజాన్ని ఎదుర్కొని ఘన విజయం సాధించాడు. రికార్డు స్థాయిలో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని, ఆంధ్ర ప్రదేశ్ సీఎం అయ్యాడు.
ఇపుడు ఈ యువ రాజకీయ నేత హీరోయిజాన్ని వెల్లడిస్తూ, జగన్ బయో పిక్‌ను తెరకెక్కిస్తున్నారు. సినీ దర్శకుడు మహి. వి. రాఘవ ఆధ్వర్యంలో జగన్ సినిమా రాబోతోంది. మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి బయో పిక్ యాత్ర ను కూడా మహినే తీశాడు. ఈ సినిమాలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రను రక్తి కట్టించడంతో యాత్ర మంచి విజయాన్ని సాధించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇపుడు దేశానికే పెద్ద ఇన్సిపిరేషన్ అంటున్నాడు సినీ దర్శకుడు మహి. వి. రాఘవ. లీడర్ ఆఫ్ మాస్‌గా అటు రాజశేఖర్ రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ యవనికపై నిలుస్తారని చెపుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్‌కే కాదు... తెలుగు ప్రేక్షకులకే కాదు... దేశ, విదేశాల్లోని యువతరానికి తెలియాల్సిన విజయ గాధగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఇపుడు అందిస్తున్న పథకాలు దేశానికే ఆకర్షణ అంటున్నాడు. అందుకే పాన్ ఇండియా సినిమా
ఇక, జగన్ క్యారెక్టర్ ఎవరు వేస్తారని ప్రశ్నిస్తే, దానికి ఎంతో కష్టపడి వెతికి మరీ హీరో ప్రతీక్ గాంధీని పట్టుకున్నామని దర్శకుడు మహి చెపుతున్నాడు. స్కాం-1992లో నటించిన ప్రతీక్ గాంధీ ఇపుడు జగన్ పాత్రధారి. అచ్చం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిలా ప్రతీక్ ముక్కు ముఖం ఉంటాయని అందుకే ఆయన్ని హీరోగా సెలక్ట్ చేసుకున్నామంటున్నారు. పైగా జగన్ సినిమా పాన్ ఇండియా సినిమా అని, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని... 2019 ఎన్నికల్లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేదే ఇతివృత్తమని దర్శకుడు వివరించారు. కరోనా తీవ్రత కొంచెం తగ్గగానే, జగన్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని దర్శకుడు మహి తెలిపారు.