పందెం కోడి-2 మూవీ రివ్యూ
నటీనటులు: విశాల్, కీర్తి సురేష్, రాజ్ కిరణ్, వరలక్ష్మి శరత్ కుమార్, రాందాస్ తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం: శక్తివేల్,
సంగీతం: యువన్ శంకర్ రాజా,
నిర్మాతలు: విశాల్-ధవల్ జయంతిలాల్-అక్షయ్ జయంతిలాల్,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లింగుస్వామి.
యాక్షన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు విశాల్. తమిళంలో 'సెండైకోళి'ని తెలుగులో 'పందెంకోడి'గా తెలుగువారికి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా ఆ చిత్రానికి సీక్వెల్‌గా చేయాలని కోరిక ఎప్పటినుంచో వుండింది. తాజాగా సీక్వెల్‌ను చేసి దసరాకు ప్రేక్షకులముందుకు వచ్చాడు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇంకా 3,4 భాగాలుకూడా తీయవచ్చన్న విశాల్.. అంతలా ఆ కథలో ఏముందో చూద్దాం.
కథ:
బాలు (విశాల్) కడప జిల్లాలో కొన్ని ఊర్లు దేవుడిగా కొలిచే రాజా రెడ్డి (రాజ్ కిరణ్) కొడుకు. కొన్నాళ్లు ఫ్యాక్షన్ గొడవల్లో తలమునకలై ఉన్న అతను చదువునిమిత్తం విదేశాలకు వెళ్తాడు. తిరిగి ఇంటికి వచ్చిన అతనికి గోపీ అనే వ్యక్తి ప్రాణాల్ని కాపాడాలని రాజారెడ్డి అతన్ని తన ఇంటిలోనే వుంచుకుంటాడు.
అయితే గోపీని చంపడానికి ప్రత్యర్థి భవాని (వరలక్ష్మి) అనుచరులు కాపుకాసుకుని వుంటారు. ఆ సమయంలోనే ఊళ్ళో జాతర వైభవంగా జరగాలని ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాల పెద్దలు కూడా ఆ బాధ్యతను రాజారెడ్డిపై పెడతాడు. అలాంటి సమయంలో అనుకోని పరిస్థితుల్లో రాజారెడ్డిపై కత్తివేటు పడుతుంది. ఇది తెలిసిన బాలు ఏం చేశాడు? తండ్రిమాటకోసం అతను ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు. భవాని పగ ఏమయింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
పాయింట్ పక్కా గ్రామీణ నేపథ్యం అయినా కథను బట్టి విభిన్నంగా తీర్చిదిద్దడంలో లింగుస్వామి శైలి వేరుగా వుంటుంది. 'రన్'.. 'పందెం కోడి'.. 'ఆవారా'.. వీటన్నింటిలోనూ బోలెడంత యాక్షన్ ఉంటుంది. వాటిలో మాస్ అంశాలకు లోటు ఉండదు. కానీ ఆ కథల్ని స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసి అందరికీ ఆమోద యోగ్యంగా మార్చాడు లింగుస్వామి. అయితే 12ఏళ్ళనాడు తీసిన చిత్రానికి సీక్వెల్‌గా తీస్తూ దాన్ని కన్‌వినెంట్‌గా మార్చడం ప్రత్యేకత. అప్పటికీ ఇప్పటికీ గ్రామాల్లో పగలు, ప్రతీకాల్లో ఎటువంటి మార్పులేదు.
అలాంటి వారికి ఎలాంటి కనువిప్పు కలిగించాడనేది హీరో పాత్ర చిత్రీకరణ కొత్తగా వుంది. హీరోకు హీరోయిన్‌కు మధ్య జరిగే ప్రేమ ట్రాక్, యాక్షన్, డైలాగ్స్ కానీ అన్నీ సమకూర్చినట్లుగా రాశారు. అయితే కథ ప్రకారం చూసుకుంటే.. ఫ్యాక్షన్ కథలన్నీ ఒకేలా వుంటాయి. ఇటీవలే విడుదలైన 'అరవింద..'కూడా ఇంచుమించు అటువంటిదే. కానీ.. అందులోని అంశాలు ఇందులో చాలా వున్నాయి. ఫ్యాక్షనిజం పేరుతో భారీగా నరుక్కోవడాలు వంటివి లేకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు.
ఇక మొదటి భాగం 'పందెం కోడి'కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది హీరో, విలన్ మధ్య సాగే సంఘర్షణ. హీరో పాత్రను సింపుల్‌గా మొదలుపెట్టి.. తర్వాత దాన్ని బిల్డ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కానీ 'పందెంకోడి-2'లో విలన్ మహిళ కావడంతో కొత్తగా అనిపించినా ఇద్దరి మధ్య పోరు పెద్దగా లేకపోవడం మరింత బలంగా లేకపోయింది. తమిళనాడు పల్లెల్లో జరిగే జాతర నేపథ్యం సినిమా అంతటా కళ్ళకు కట్టినట్లు కన్పించడం.. టెక్నాలజీ రీత్యా ఎలా చూపించవచ్చో విషయాన్ని బాగా చూపించాడు.
హీరో ఎలివేషన్ సీన్లు.. హీరోయిన్ పాత్ర నేపథ్యంలో సాగే కామెడీ.. బాగానే ఆకట్టుకుంటాయి. వాటిని తీర్చిదిద్దిన విధానం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. సినిమాలో ఒక చోట భారీ స్థాయిలో జాతర జరుగుతుండగా.. ఎవ్వరూ డిస్టర్బ్ కాకుండా రౌడీ బ్యాచ్ పని పడతాడు హీరో. ఆ ఎపిసోడ్ మాస్‌కు విందే. పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయొచ్చో లింగుస్వామి ఇక్కడ చూపించాడు. మరోచోట ఓవైపు విశాల్.. మరోవైపు రాజ్ కిరణ్ వేర్వేరు చోట్ల రౌడీల పని పడతారు.
దాన్ని కూడా బాగానే డిజైన్ చేశారు. 'మహానటి' తర్వాత కీర్తికి మంచి పాత్రే దక్కింది. వరలక్ష్మి తనే డబ్బింగ్ చెప్పుకుని ఫెరేషియస్‌గా నటించింది. డ్యాన్సుల్లో కీర్తి ఎనర్జీ ఆకట్టుకుంటుంది. హీరో తండ్రిగా కీలకమైన పాత్రలో రాజ్ కిరణ్ కూడా మెప్పించాడు. విలన్‌గా వరలక్ష్మి పెర్ఫామెన్స్ బాగుంది. పతాక సన్నివేశంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులంతా ఓకే.
అయితే ఈ కథలో చెప్పుకోదగ్గ మలుపులు.. విశేషాలేమీ కనిపించకపోయినా.. చివరి వరకు ఏం జరుగుతుందనే ఆసక్తి కలిగించింది. ప్రాణానికి ప్రాణం కాదనే విషయంలో సన్నివేశపరంగా ఇచ్చిన సందేశం లాజిక్‌గా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే చిత్రమవుతుంది.
యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం కథకు సరిపోయింది. శక్తివేల్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో మరిన్ని మలుపులు చూపించి వుంటే మరింతగా ఆకట్టుకునేది. మాట విలువ కోసం అప్పటి తరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని వారసుడు ఎలా నెరవేర్చాలనే విలువల్ని ఈ చిత్రంలో మరోసారి చూపించాడు.