అనురాగ్ కశ్యప్‌పై అత్యాచారం కేసు.. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదట!
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 19న పాయల్ చేసిన ఆరోపణలు బాలీవుడ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కశ్యప్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానమంత్రిని సైతం ఆమె ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు.
తాజాగా అనురాగ్ కశ్యప్‌పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించిన ప్రముఖ నటి పాయల్ ఘోష్ ప్రస్తుతం అత్యాచారం కేసు పెట్టారు. ఈ మేరకు వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది నితిన్ సాత్పూట్ వెల్లడించారు.
నిందితుడిపై ఎట్టకేలకు కేసు నమోదైందని చెప్పారు. అత్యాచారం, దురుద్దేశంతో మహిళను నిర్బంధించి వారి గౌరవానికి భంగం కలిగించడంపై ఐపీసీలోని 376(1), 354, 341, 342 సహా పలు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ దాఖలైందని అని న్యాయవాది ట్వీట్ చేశారు.
కాగా తనపై పాయల్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అనురాగ్ పేర్కొన్నారు. ఈ విషయంలో మౌనంగా ఉండాలని తన న్యాయవాది సలహా ఇచ్చినట్టు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.