శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (11:23 IST)

"ఆదిపురుష్" ఓ చిత్రం కాదు.. భక్తికి ప్రతీక : ఓం రౌత్

adipurush team
ప్రభాస్ - కృతి సనన్ జంటగా తాను తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం ఓ చిత్రం మాత్రమే కాదని అద భక్తికి ప్రతీక అని ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ అన్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం అయోధ్యలో జరిగింది. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. 
 
ఇందులో దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, 'శ్రీరామ భక్తుడిగా నేను ఇక్కడికి వచ్చాను. అయోధ్య వేదికగా 'ఆదిపురుష్‌' టీజర్‌ విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. 'ఆదిపురుష్' అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. భక్తికి ప్రతీక. ఈ కథను ఒక మిషన్‌లా భావించి మేమంతా ఇష్టపడి తెరకెక్కించాం. టీజర్‌ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. సినిమాకు మంచి ఫలితాన్ని ఇస్తారనుకుంటున్నా' అని అన్నారు.
 
అలాగే హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ, 'నవరాత్రుల వేడుకల్లో భాగంగా అయోధ్యలో మా సినిమా టీజర్‌ విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో, గొప్ప పాత్రల్లో నటించే అవకాశం అందరికీ సులభంగా దొరకదు. నా కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నా. సీత పాత్రలో నటించడం ఉద్వేగంగా అనిపించింది. షూటింగ్ పూర్తవుతుంటే బాధకు లోనయ్యా' అని చెప్పుకొచ్చారు. 
 
కాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా కనిపించనున్నారు. భూషణ్‌ కుమార్‌, కృష్ణ కుమార్‌, ఓం రౌత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.