సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (08:09 IST)

రాముడు దేవుడు మ‌నం మ‌నుషులం ఎందుక‌య్యామంటే, ఆదిపురుష్ టీజ‌ర్‌లో ప్ర‌భాస్‌

prabhas,om routh,kriti
prabhas,om routh,kriti
 ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ "ఆదిపురుష్". రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భూషణ్ కుమార్,ఓం రౌత్  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ భారీ చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రం టీజ‌ర్ అయోధ్యలో ఘనంగా జ‌రిగింది. టీజర్ మరియు పోస్టర్ లాంచ్‌కు ముందు అయోధ్యలోని రామమందిరంలో ఆశీస్సులు కోరడం ద్వారా #ప్రభాస్, నిర్మాత #భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
 
prabhas,om routh,kriti
prabhas,om routh,kriti
ఆదివారం సరయూ నది తీరాన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆదిపురుష్ భారీ పోస్టర్ రిలీజ్ చేశారు. చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది టీజర్ లో అద్భుతంగా చూపించారు. 
 
టీజర్ విడుదల సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ...శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు అయోధ్య నగరానికి వచ్చాం. మొదట ఈ పాత్రలో నటించేందుకు భయపడ్డాను. ప్రాజెక్ట్ అనుకున్న మూడు రోజుల తర్వాత దర్శకుడు ఓం రౌత్ కు ఫోన్ చేశాను. ఈ పాత్రలో మెప్పించేలా ఎలా నటించాలి అనేది మాట్లాడుకున్నాం.  ప్రేమ, భయ భక్తులతో ఈ సినిమాను రూపొందించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం ఈ మూడు విషయాలను శ్రీరాముడి ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులం అయ్యాం, శ్రీరాముడు దేవుడు అయ్యారు. శ్రీరాముడి కృప మాపై ఉంటుందని నమ్ముతున్నాం. అన్నారు.
 
దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ..పవిత్ర అయోధ్య నగరంలో ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేడుక జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి నేను ఒక శ్రీరామ భక్తుడిగా వచ్చాను. ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమానే కాదు భక్తికి ప్రతీక. మా అందరి ఇష్టంతో ఇదొక మిషన్ లా భావించి పనిచేశాం. టీజర్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే ప్రేమను మాపై చూపించండి. అన్నారు.
 
హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ...దసరా పర్వదినం రాబోతోంది. భక్తి శ్రద్ధలతో మనమంతా నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇలాంటి శుభ సమయంలో అయోధ్య పవిత్ర నగరంలో మా సినిమా టీజర్ విడుదల కార్యక్రమం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకంటే మంచి సమయం, మంచి వేదిక మాకు దొరకదు. ఇలాంటి గొప్ప కథల్లో, పాత్రల్లో నటించే అవకాశం అందరికీ దక్కదు. నా కెరీర్ లో అతి త్వరగా ఈ అవకాశం రావడం ఆనందంగా ఉంది. జానకి పాత్రలో నటించడం ఉద్వేగంగా అనిపించింది. సినిమా షూటింగ్ పూర్తవుతుంటే బాధకు లోనయ్యాను. ఒక కల తీరిన ఫీలింగ్ కలిగింది. మనందరికీ తెలిసిన రామాయణ గాథ ఇది. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెబుతుంటే విని ఉంటాం. అప్పుడే మన మనసులో రామాయణం ఎలా ఉంటుందనే ఊహించుకుని ఉంటాం. ఈ సినిమాను పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడండి. మన ఇతిహాస ఘనతను ఆదిపురుష్ లో చూస్తారు. అన్నారు.
 
నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ... మా నాన్నగారు గుల్షన్ కుమార్ శ్రీరామ భక్తుడు. రాామాయణ నేపథ్యంతో సిినిమా నిర్మించాలనే ఆయన కల ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. తానాజీ తర్వాత శ్రీరాముడి దివ్య గాథను సిినిమాగా రూపొందిస్తానని దర్శకుడు ఓం రౌత్ నా దగ్గరకు వచ్చారు. నేను వెంటనే ఈ ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపాను. నాకు ఈ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చిన టీమ్ అందరికీ థాంక్స్. ప్రభాస్, కృతి సనన్ అద్భుతంగా పర్మార్మ్ చేశారు. అన్నారు.
 
వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న "ఆదిపురుష్" సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.