శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (11:37 IST)

'రెబెల్ స్టార్' వారసుడుకి పుట్టినరోజు ... శుభాకాంక్షల 'వర్షం'లో తడిసిపోతున్న "సాహో"

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా తెలుగు వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో ప్రభాస్ రాజు. ఇపుడు రికార్డుల రారాజుగా మారిపోయాడు. "ఈశ్వ‌ర్" సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యమైన ఈ యువరాజు ఆ త‌ర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్‌, డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, రెబల్‌, మిర్చి, బాహుబ‌లి, బాహుబ‌లి 2, సాహో వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టించి పాన్ ఇండియా స్టార్‌గా మారాడు.
 
నిజానికి బాహుబ‌లి సినిమాకు ముందు ప్ర‌భాస్ క్రేజ్ కేవలం టాలీవుడ్‌కే పరిమితమైవుండేది. కానీ ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం ఒక్కసారిగా ఆకాశమంత పెరిగిపోయింది. ఈ ఒక్క సినిమా కోసం దాదాపు ఐదేళ్ళు కేటాయించిన డార్లింగ్ అమ‌రేంద్ర బాహుబ‌లిగా, మ‌హేంద్ర బాహుబ‌లిగా ప్రేక్ష‌కుల మ‌న‌సులలో నిలిచిపోయాడు. 
 
బాహుబ‌లి సినిమాని ఓ మ‌హాయ‌జ్ఞంలా భావించి అంకిత‌భావంతో ప‌నిచేశాడు. ఈ సినిమా కోసం ఐదేళ్ళు కేటాయించిన ప్ర‌భాస్‌ మరే ఇత‌ర ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. అలాంటి ప్రభాస్ శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. సినీ సెలెబ్రిటీలు, అభిమానులు చెబుతున్న శుక్షాకాంక్షల వర్షంలో ప్రభాస్ తడిసి ముద్దవుతున్నాడు.
 
టాలీవుడ్‌లో ప్రభాస్ రాజు పేరు వింటే చాలు అభిమానుల మదిలో ఆనందం అంబరమంటుతుంది... 'బాహుబలి'గా ప్రభాస్ ప్రభ దశదిశలా ప్రసరిస్తోంది. దీంతో తెలుగునేలపైనే కాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ, అంతర్జాతీయంగా ఉన్న తెలుగువారందరూ ప్రభాస్ తాజా చిత్రాల కోసం కళ్ళు ఇంతలు చేసుకొని ఎదురుచూస్తున్నారు. 
 
'రాధే శ్యామ్'లో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలసి అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టే ఆ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందనీ తెలుస్తోంది. ఇక 'ఆదిపురుష్'లో శ్రీరాముడుగా కనిపించనున్నాడు. ఈ రెండు చిత్రాలు కాకుండా టైమ్ మిషన్‌తో ప్రయాణం చేస్తూ వైజయంతీ మూవీస్‌లో వినోదం పంచబోతున్నాడు. ఈ సినిమాలు ఎలా ఉంటాయో? ఎలా అలరిస్తాయో అన్న చర్చ అభిమానుల్లో అప్పుడే మొదలైంది.
 
ఇకపోతే, ప్రభాస్ పేరే తమ సినిమాలకు ఓ ఎస్సెట్ అని అనేక మంది నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే అతనితో సినిమాలు నిర్మించేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రభాస్‌తో రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తెరకెక్కిస్తున్నదీ బాలీవుడ్ జనమే. ఇక ఇంటర్నేషనల్‌గానూ ప్రభాస్‌కు ఎనలేని క్రేజ్ సొంతమైంది. దాంతో 'ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా'గానూ ప్రభాస్ జేజేలు అందుకుంటున్నాడు.
prabhas
 
అయితే, ఏ స్థాయిలో స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నా, ప్రభాస్ ఎప్పటిలాగే సన్నిహితులను 'డార్లింగ్' అంటూ అభిమానంగా పిలుస్తూ సాగుతున్నాడు. ఇంతటి స్టార్ డమ్ ప్రభాస్ సొంతమైనా, అతను ఎప్పటిలాగే ఉన్నాడని, మార్పు ఇంతయినా లేదని హితులు, సన్నిహితులు చెబుతున్నారు. ఇక అభిమానులు తమ 'డార్లింగ్ హీరో' రాబోయే అన్ని చిత్రాలతోనూ జనాన్ని విశేషంగా అలరించాలని ఆశిస్తున్నారు. 
 
అయితే, కోట్లాడి మంది ప్రభాస్ ఫ్యాన్స్‌లో చిన్న అసంతృప్తి ఉంది. ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రు పెళ్లి పీట‌లెక్క‌గా, త‌మ అభిమాన హీరోని కూడా పెళ్ళి కుమారుడిగా చూడాల‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌భాస్ పెళ్ళిపై ఇప్ప‌టికే ఎన్నో రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, అవ‌న్నీ ప్ర‌చారాలుగానే మిగిలిపోయాయి. 
 
ఈ రోజుతో 41వ వ‌సంతంలోకి అడుగు పెట్టిన ప్ర‌భాస్ రానున్న కొద్ది రోజుల‌లో అయిన అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెబుతాడా అనేది చూడాలి. కాగా, ఈ రోజు ప్ర‌భాస్ 41వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీకి చెందిన ప్రముఖులు, అభిమానులు, పలువురు రాజ‌కీయ నాయ‌కులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు.