బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:21 IST)

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా!.. ఫైర్.. ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్ అదుర్స్‌

Pushpa - allu arjun
‘పుష్ప: ది రైజ్’ సినిమా సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.. ఎంత గ్రాండ్‌గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపిస్తుంది. పుష్ప ట్రైలర్‌ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మొదలైంది. ఆ తర్వాత మధ్యలో చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు. శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వచ్చే వాయిస్ ఓవర్ కానీ.. డైలాగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. 
 
ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఆయన పుష్ప రాజ్ పాత్రకు ప్రాణం పోసారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ముఖ్యంగా సూపర్ పోలీస్ ఆఫీసర్‌తో డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్. ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అలాగే చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్ కానీ.. డిసెంబర్ 17 నుంచి మాస్ పార్టీ స్టార్ట్స్ అంటూ వచ్చే ట్రైలర్ ఎండ్ కానీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూరుస్తూ.. సంచలన దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోయే పర్ఫెక్ట్ మాస్ సినిమాగా పుష్ప వస్తుంది. 
 
దీనిపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది. అలాగే ట్రైలర్‌లో బన్నీ, రష్మిక మధ్యే వచ్చే రెండు మూడు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. వాటిని నిలబెడుతూ ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. 
 
ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.