సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (17:47 IST)

ఏపీ. సీఎం రిలీఫ్ ఫండ్ కు అల్లు అర్జున్ 25 లక్షల విరాళం

Allu Arjun
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను ఊహించని వరదలు ముంచెత్తాయి. గత కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తు ఈ మధ్యకాలంలో ఏపీ చవిచూసింది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల కారణంగా ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లింది. తక్షణమే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. 
 
అందులోనూ ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ తన వంతు సహాయం ఎప్పుడూ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఆయన ముందుకు వచ్చారు. ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయిన వాళ్లకు తనవంతు సహాయంగా.. 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. గతంలో కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో 1.25కోట్ల రూపాయల విరాళం అందించారు. 
 
అలాగే కేరళకు వరదలు ముంచెత్తినప్పుడు 25 లక్షలు విరాళం అందించారు అల్లు అర్జున్. అంతకుముందు కూడా ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు తన వంతు సహాయం చేశారు అల్లు అర్జున్. ఇప్పుడు కూడా ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వరదలు బాధాకరమని ఆయన తెలిపారు. వీటి వల్ల నష్టపోయిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు.