సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (12:16 IST)

ఏరో బ్రిడ్జిపై ఇరుక్కుని పోయిన రాధికా ఆప్టే

radhika apte
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో ఫ్లైట్లో భువనేశ్వర్ వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయారు. విమానం కోసం గంటల తరబడి ఎదురుచూసిన ప్రయాణికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వెంటిలేషన్ సరిగా లేకపోవడంతో సిబ్బందితో ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లో ప్రముఖ నటి రాధికా ఆప్టే కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించారు.
 
'నేను ఇది పోస్ట్ చేయాల్సి వచ్చింది!. ఈ రోజు (శనివారం) ఉదయం 8.30 గంటలకు నేను ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. ఇప్పుడు 10.50 గంటలు అవుతున్నా ఇంకా విమానం ఎక్కలేదు. కానీ మేము ఫ్లైట్ ఎక్కబోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. ప్రయాణికులు అందరినీ ఏరోబ్రిడ్జి ఎక్కించి లాక్ చేశారు!' అని రాధికా ఆప్టే పేర్కొన్నారు. 
 
ప్రయాణికుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని, వీరంతా గంటల తరబడి బంధీ అయ్యారని ఆమె పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు తెరవలేదని, విమానం రాకపై సిబ్బందికి ఖచ్చితంగా సమాచారం లేదని పోస్టులో తెలిపారు.
 
'సిబ్బంది విమానం ఎక్కలేదు. తదుపరి డ్యూటీకి వచ్చే సిబ్బంది కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి సమస్యా లేదని, విమానం వస్తుందని బుద్ది లేకుండా చెబుతున్నారు. నేను లోపల లాక్ అయ్యాను. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే ఉంటామని మాకు చెప్పారు. తాగునీరు కూడా లేదు' అని రాధికా ఆప్టే ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.